మరో 20 ఏళ్లలో కేటీఆరే భారత ప్రధాని: మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని

25-05-2022 Wed 07:50
  • దావోస్‌లో కేటీఆర్‌ను కలిసిన ఆశా మోత్వాని
  • కేటీఆర్ లాంటి రాజకీయ నాయకుడిని తానింత వరకు చూడలేదంటూ ప్రశంసలు
  • పెట్టుబడుల ఆకర్షణకు కేటీఆర్ బృందం దావోస్‌లో అద్భుత కృషి చేస్తోందన్న మోత్వాని
Dont be surprised if KTR becomes PM of India says Asha Motwani
తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై అమెరికాలోని వెంచర్ క్యాపిటలిస్ట్, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసలు కురిపించారు. అన్ని అంశాలపైనా స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న కేటీఆర్ లాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలోనే ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. వచ్చే 20 ఏళ్లలో కేటీఆర్ భారతదేశ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ ట్వీట్ చేశారు.

దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్‌ను కలిసిన మోత్వాని ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు కేటీఆర్ బృందం దావోస్‌లో అద్భుత కృషి చేస్తోందన్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, అనుకూలతలను వారు వివరిస్తూ దావోస్‌లో దూసుకెళ్తున్నారని కొనియాడారు.