యుద్ధ నేరాలపై మొదలైన విచారణ... రష్యా సైనికుడికి జీవితఖైదు విధించిన ఉక్రెయిన్ కోర్టు

23-05-2022 Mon 17:45
  • ఫ్రిబవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • ఉక్రెయిన్ గడ్డపై అకృత్యాలకు పాల్పడిన రష్యా బలగాలు
  • విచారణలు చేపట్టిన ఉక్రెయిన్ న్యాయస్థానాలు
  • తొలి శిక్ష పడిన వైనం
Ukraine court imposes life sentence to Russian soldier
ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా తీవ్ర దాడులతో విరుచుకుపడుతోంది. రష్యా సేనల దాడులను ఉక్రెయిన్ దళాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. కొన్ని చోట్ల రష్యా బలగాలకు నష్టం వాటిల్లింది. రష్యా సైనికులు ఉక్రెయిన్ దళాలకు బందీలుగా పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో, రష్యా యుద్ధ నేరాలపై ఉక్రెయిన్ కోర్టు విచారణ చేపట్టింది. ఓ పౌరుడ్ని కాల్చిచంపిన రష్యా సైనికుడ్ని దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధించింది. 

ఆ రష్యా సైనికుడి పేరు వదీమ్ షిషిమారిన్. 21 ఏళ్ల షిషిమారిన్ రష్యా సైన్యంలో సార్జెంట్ హోదాలో ఉన్నాడు. ఫిబ్రవరి 28న ఈశాన్య సుమీ ప్రాంతంలోని ఒక గ్రామంలో ఓ గ్రామస్తుడ్ని తలకు గురిపెట్టి కాల్చి చంపాడన్న అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. కోర్టులో విచారణ సందర్భంగా, తాను కాల్పులు జరిపింది నిజమేనని, అయితే ఉన్నతాధికారి ఆదేశాల మేరకే కాల్చి చంపానని తెలిపాడు. తమ గురించి ఉక్రెయిన్ సైన్యానికి అతడు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తాడేమోనని భావించి కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించాడు. 

అయితే, ఆ రష్యా సైనికుడు యుద్ధ నేరానికి పాల్పడినట్టు నిర్ధారించిన న్యాయమూర్తి జీవితఖైదు విధిస్తున్నట్టు తీర్పు వెలువరించారు. దండయాత్రకు దిగినప్పటి నుంచి రష్యా సైనికులు ఉక్రెయిన్ గడ్డపై పాల్పడిన అరాచకాలు, అఘాయిత్యాలకు సంబంధించి వేలాది కేసులు ఇప్పుడు ఉక్రెయిన్ కోర్టుల్లో విచారణకు వచ్చాయి. తాజాగా, సార్జెంట్ షిషిమారిన్ కు జీవితఖైదు ద్వారా రష్యా యుద్ధనేరాల విషయంలో తొలి శిక్ష పడినట్టయింది.