మంత్రి మేరుగ నాగార్జున పేరు చివ‌ర‌ 'రెడ్డి'!.. వ్యంగ్యాస్త్రం సంధించిన అనిత‌!

23-05-2022 Mon 17:13
  • మార్కాపురంలో అభివృద్ధి ప‌ని ప్రారంభానికి హాజ‌రైన నాగార్జున‌
  • శిలాఫ‌ల‌కంపై మేరుగ నాగార్జున రెడ్డి అని రాయించిన అధికారులు
  • ద‌ళిత బిడ్డ అన్న విష‌యాన్ని నాగార్జున మ‌రిచిపోయిన‌ట్టున్నార‌న్న అనిత‌
telugu mahila president ajnitha satires on ap minister meruga nagarjuna
ఏపీలో అధికార వైసీపీ, విప‌క్ష నేత‌ల మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున పేరు చివ‌ర రెడ్ది అనే ప‌దం క‌నిపించిన తీరుపై తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

వాస్తవానికి మేరుగ నాగార్జున ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ఆయ‌న పేరు నాగార్జున మాత్ర‌మే. అయితే శ‌నివారం ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలోని ఓ పార్కు అభివృద్ధి ప‌నుల ప్రారంభం సంద‌ర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కంపై మేరుగ నాగార్జున పేరును మేరుగ నాగార్జున‌రెడ్డి అని రాయించారు.

ఈ విష‌యాన్ని గమనించిన అనిత‌... నాగార్జున తాను ద‌ళిత బిడ్డ‌ను అన్న విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్లు ఉన్నార‌ని సెటైర్ సంధించారు. ద‌ళితుల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతుంటే మాట్లాడ‌రంటూ నాగార్జున‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అనిత‌.. ద‌ళితుల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతున్నా మాట్లాడ‌రంటూ మండిప‌డ్డారు. మంత్రి పదవి, బుగ్గ కారు వచ్చాక పూర్తిగా పాలెగాళ్ళలో కలిసిపోయారన్న అనిత‌... అందుకే వాళ్ళు ఈ తోక తగిలించారంటూ వ్యంగ్యం ప్ర‌ద‌ర్శించారు.