కవి పంచభూతాల్లో కలిసిపోయినా భావితరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటాడు: 'సిరివెన్నెల'ను స్మరించుకున్న పవన్ కల్యాణ్

23-05-2022 Mon 16:46
  • మే 20న 'సిరివెన్నెల' జయంతి
  • పలుచోట్ల కార్యక్రమాలు
  • 'సిరివెన్నెల' సమగ్ర సాహిత్యం తొలి సంపుటి విడుదల
  • స్పందించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan gets emotional in memory of Sirivennela
ప్రముఖ గీత రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి జయంతి వేడుకలు ఇటీవల (మే 20) ఇటీవల పలు చోట్ల నిర్వహించారు. హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో సిరివెన్నెల సమగ్ర సాహిత్యం మొదటి సంపుటి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ పవన్ కల్యాణ్ 'సిరివెన్నెల'ను స్మరించుకున్నారు. 

కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడని, లేకపోయినా తను సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తాడని పవన్ కల్యాణ్ తెలిపారు. కవి పంచభూతాలలో కలిసిపోయినా భావితరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటాడని పేర్కొన్నారు. అలాంటి ఒక గొప్ప కవి 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి అని కొనియాడారు. 'సిరివెన్నెల' ప్రవచించిన విధంగా, తనను నిలబెట్టిన ఈ సమాజం రుణం తీర్చుకోవడాన్ని విధిగా భావిస్తానని పవన్ తెలిపారు. 

మనకున్నది పది మందికీ పంచాలి... అది ప్రకృతి ధర్మం అని 'సిరివెన్నెల' తన గీతాల ద్వారా వివరించారని పేర్కొన్నారు. ఏరు దాటాక తెప్ప తగలబెట్టే ఆలోచనలతో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఒకసారి 'సిరివెన్నెల' సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవాలని హితవు పలికారు. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రచనలన్నింటిలోను ఆయనలోని సామాజిక బాధ్యత కనిపిస్తుందని పవన్ వివరించారు. ఆయన అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు అని కీర్తించారు. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ 'సిరివెన్నెల' రచనలలోని గాఢతను చెబుతూ కవిగా ఆయన్ని మరింత అర్థం చేసుకునేలా చేశారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. అంతేగాకుండా, 'సిరివెన్నెల' సమగ్ర సాహిత్యం అందిస్తున్న తానా బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నట్టు వివరించారు.
.