దావోస్ సదస్సుకు టీడీపీ ఎంపీ!... కేంద్ర మంత్రితో క‌నిపించిన గ‌ల్లా జ‌య‌దేవ్!

23-05-2022 Mon 16:35
  • అమర‌రాజా య‌జ‌మాని హోదాలో స‌ద‌స్సుకు గల్లా జ‌య‌దేవ్‌
  • ఎన‌ర్జీ రంగంలోని సంస్థ‌లతో భేటీ కోస‌మే వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డి
  • "ఎన‌ర్జీ అవుట్‌లుక్‌.. ఓవర్‌క‌మ్ ద క్రైసిస్"పై చ‌ర్చ‌కు గ‌ల్లా హాజ‌రు
tcp mp galla jayadev spotted in devos summit
దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సుకు ఏపీకి చెందిన టీడీపీ యువ నేత‌, గుంటూరు పార్ల‌మెంటు స‌భ్యుడు గ‌ల్లా జ‌య‌దేవ్ హాజ‌ర‌య్యారు. ఈ స‌ద‌స్సుకు హాజ‌రైన కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురితో కలిసి ఆయ‌న క‌నిపించారు. స‌ద‌స్సులో కేంద్ర మంత్రితో తాను తీయించుకున్న ఫొటోను స్వ‌యంగా గల్లా జ‌య‌దేవే ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. 

గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ ఎంపీ కాక ముందు నుంచే పారిశ్రామిక‌వేత్త‌గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌ల్లా కుటుంబం ఆధ్వ‌ర్యంలోనే అమ‌ర‌రాజ బ్యాట‌రీస్ కొన‌సాగుతోంది. ఈ కంపెనీ య‌జ‌మాని హోదాలోనే ఆయ‌న దావోస్ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఎన‌ర్జీ రంగానికి చెందిన ప‌లు ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధి బృందాల‌తో భేటీ కోస‌మే ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యాన‌ని చెప్పిన జ‌య‌దేవ్‌.. "ఎన‌ర్జీ అవుట్‌లుక్‌.. ఓవర్‌క‌మ్ ద క్రైసిస్" పేరిట సాగిన చ‌ర్చ‌లో పాలుపంచుకున్నాన‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగానే కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురిని క‌లిశాన‌ని ఆయ‌న వెల్లడించారు.