ఆహారం, ఔషధాలతో భారత్ నుంచి శ్రీలంక చేరుకున్న నౌక

23-05-2022 Mon 16:03
  • దివాలా అంచున శ్రీలంక ప్రభుత్వం
  • దేశంలో నిత్యావసరాలకు తీవ్ర కొరత
  • ఇతర దేశాల వైపు చూస్తున్న శ్రీలంక
  • స్పందించిన భారత కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు సర్కారు
Indian consignment with essentials arrived Sri Lanka
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక  ప్రపంచ దేశాల వైపు దీనంగా చూస్తోంది. అప్పులు తీర్చలేక చేతులెత్తేసిన శ్రీలంకకు భారత్ వంటి దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. తాజాగా భారత్ నుంచి నిత్యావసర వస్తువులతో కూడిన తొలి నౌక శ్రీలంక చేరుకుంది. ఇందులో రూ.124 కోట్ల విలువైన నిత్యావసరాలు ఉన్నాయి. ఇందులోనే, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.43 కోట్ల విలువైన బియ్యం, పాల పొడి, ఔషధాలు ఉన్నాయి. 

వీటిని శ్రీలంకలో భారత రాయబారి గోపాల్ బాగ్లే స్థానిక అధికారులకు అందించారు. శ్రీలంకలోని వివిధ ప్రాంతాల్లో అలమటిస్తున్న కుటుంబాలకు ఈ నిత్యావసరాలను పంపిణీ చేయనున్నారు. కాగా, భారత్ పంపిన సాయం పట్ల ప్రధాని రణిల్ విక్రమసింఘే కృతజ్ఞతలు తెలియజేశారు. 

అటు, భారత్ నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ తో బయల్దేరిన నౌక కూడా శ్రీలంక చేరుకుంది. శ్రీలంకలో గత కొన్నిరోజులుగా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దాంతో ఇంధనం లేక రవాణా వ్యవస్థ కుంటుపడడమే కాదు, విద్యాసంస్థలు కూడా మూతపడ్డాయి.
.