సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలి: లోకేశ్

23-05-2022 Mon 15:46
  • సంచలనం రేకెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ డ్రైవర్ హత్య కేసు
  • ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదన్న నారా లోకేశ్
  • మృతుడి కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్
Nara Lokesh demands driver Subrahmanyam murder case should be investigated by CBI
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉదయ్ భాస్కరే డ్రైవర్ ను హత్య చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ, సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కేసు రిజిస్టర్ అయి 72 గంటలు కావస్తున్నా ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. 

ఇదే సమయంలో లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎమ్మెల్సీ కలిశారని... హత్య కేసు నుంచి రక్షించాలని వారిని కోరారని తెలిపారు. మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. 1 కోటి పరిహారాన్ని చెల్లాంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని హోంమంత్రి వనిత ఇంత వరకు పరామర్శించలేదని దుయ్యబట్టారు.