ఆ ఘన విజయానికి మూడేళ్లు.. అంటూ వైసీపీ ట్వీట్!

23-05-2022 Mon 14:37
  • సుదీర్ఘంగా సాగిన 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు
  • 2019 మే 23న ఓట్ల లెక్కింపు
  • ఏపీలో ఘ‌న విజ‌యం సాధించిన వైసీపీ
  • మ‌రిచిపోలేని విజ‌యాన్ని గుర్తు చేసుకుంటూ సంబ‌రాలు
ysrcp celebrates 3 years of victory
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు సుదీర్ఘంగా సాగిన సంగ‌తి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా లోక్ స‌భ ఎన్నిక‌లు, ప‌లు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడ‌త‌ల‌వారీగా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించింది. 

ఈ క్ర‌మంలో చివ‌రి ద‌శ కంటే చాలా ముందుగానే పోలింగ్ ముగిసిన ప్రాంతాలలో ఓట్ల లెక్కింపున‌కు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. ఎందుకంటే... అన్ని ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్తి అయ్యాక గానీ ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌దు. ఇదే రీతిన ఏపీ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యేందుకు పోలింగ్ ముగిశాక చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. 

మూడేళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజున... అంటే 2019 మే 23న ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌గా... అప్ప‌టిదాకా విప‌క్షంగా సాగిన వైసీపీ రికార్డు విక్ట‌రీ కొట్టింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్ల‌కు గాను ఏకంగా 151 సీట్ల‌ను వైసీపీ ఎగరేసుకుపోయింది. అదే రీతిన రాష్ట్రంలో 25 లోక్ స‌భ స్థానాలుంటే... వాటిలో వైసీపీ 22 సీట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. వెర‌సి రికార్డు మెజారిటీతో వైసీపీ అధికార పార్టీగా కొత్త అవ‌తారం ఎత్తింది. ఈ మ‌రిచిపోలేని విజ‌యాన్ని గుర్తు చేసుకుంటూ వైసీపీ సోమ‌వారం సంబ‌రాలు చేసుకుంది. 'రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు..' అంటూ వైసీపీ తన అధికార ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.