జగన్ దావోస్ లో ఉండి సజ్జలతో ఈ వ్యవహారం నడిపిస్తున్నారు: మాజీ మంత్రి బండారు

23-05-2022 Mon 14:33
  • ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం
  • శవమై తేలిన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం
  • అనంతబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదన్న బండారు
  • సజ్జల డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యలు
Former minister Bandaru comments on driver Subrahmanyam death issue
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విశాఖలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవమై తేలిన ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించారు. హత్య చేసిన వ్యక్తే మృతదేహాన్ని తీసుకువచ్చి మృతుడి భార్యకు అప్పగించడం జగన్ పాలనలోనే చూస్తున్నామని వ్యాఖ్యానించారు.  

సంఘటన స్థలం నుంచి నేరుగా మృతదేహాన్ని తీసుకువచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదని బండారు ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోందని, జగన్ దావోస్ లో ఉండి సజ్జలతో ఈ వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. కాకినాడ పోలీసులు ఈ సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.