మెహ్రీన్ కి ఇప్పుడు హిట్టు చాలా అవసరం!

23-05-2022 Mon 12:01
  • గ్లామరస్ హీరోయిన్ గా మెహ్రీన్ కి క్రేజ్ 
  • కెరియర్ ఆరంభంలో పడిన వరుస హిట్లు 
  • పెళ్లి ఆలోచనతో అవకాశాలను పక్కన పెట్టిన మెహ్రీన్ 
  • కొన్ని కారణాల వలన ఆమె నిర్ణయంలో మార్పు 
  • ఇప్పుడిక పూర్తి స్థాయిలో కెరియర్ పైనే దృష్టి
F3 movie update
తెలుగు తెరపై అందాల సందడి చేస్తున్న కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మెహ్రీన్, తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను అందుకుంది. గ్లామర్ పరంగా కుర్రకారు నుంచి మంచి మార్కులు అందుకుంది. ఆ తరువాత 'మహానుభావుడు' .. 'రాజా ది గ్రేట్' వంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో చేరిపోయాయి.

ఆ తరువాత వరుస పరాజయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, 'ఎఫ్ 2' హిట్ ఆమెకి ఊరటనిచ్చింది. ఆ సినిమా తరువాత ఆమె తన కెరియర్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. పెళ్లి చేసుకుని వెళ్లిపోవాలనే ఉద్దేశంతో కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నించలేదు. దాంతో ఆమె కోసం అనుకున్న పాత్రలు వేరేవారికి వెళ్లిపోయాయి. 

అయితే కొన్ని కారణాల వలన మెహ్రీన్ పెళ్లి విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. మంచి సంబంధం సెట్ అయ్యేంత వరకూ ఇండస్ట్రీలో కొనసాగాలని భావించింది. అందులో భాగంగానే ఆమె మారుతిని రిక్వెస్ట్ చేసి మరీ ఓ చిన్న సినిమా చేసింది. ఆ సమయంలోనే ఆమెకి 'ఎఫ్ 3' సినిమా ఊతమిచ్చినట్టు అయింది. ఇప్పుడు ఈ సినిమా హిట్ కోసం అందరికంటే ఆమెనే ఎక్కువగా వెయిట్ చేస్తోంది. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ ఆమె కెరియర్ కి అంత అవసరం మరి.