పెళ్లి పందిరిలో వ‌ధువు కుప్ప‌కూలిన కేసు.. ప్రియుడి కోస‌మే అలా చేసింద‌ని గుర్తించిన పోలీసులు

23-05-2022 Mon 10:51
  • పెళ్లి ఆపాల‌నే ప్ర‌య‌త్నంలో ప్రాణాలు పోగొట్టుకున్న సృజ‌న 
  • కాల్ డయల్ రికార్డర్ లోని వివ‌రాలు సేక‌రించిన పోలీసులు
  • పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో ఇన్ స్టాగ్రామ్ లో సృజ‌న‌ ఛాటింగ్‌
  • ఎలాగైనా పెళ్లి ఆపుతాన‌ని చెప్పిన సృజ‌న‌
police on srujana death case
విశాఖలోని మధురవాడలో ఇటీవ‌ల ఓ పెళ్లి వేడుక‌లో జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో పెళ్లి కూతురు సృజ‌న‌ కుప్పకూలిపోయి, మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీనిపై విచార‌ణ జరిపిన పోలీసులకు ప‌లు వివ‌రాలు తెలిశాయి. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారణ‌కు వ‌చ్చారు. 

కాల్ డయల్ రికార్డర్ తో పాటు పెళ్లికి మూడు రోజుల ముందు ఆమె ప్రియుడితో ఇన్ స్టాగ్రామ్ లో ఛాటింగ్‌ చేసిన వివ‌రాలను పోలీసులు సేక‌రించారు. పరవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తితో ఆమె ఏడేళ్లుగా ప్రేమలో ఉందని తేల్చారు. అయితే, మోహ‌న్ కు సరైన ఉద్యోగం లేకపోవడంతో అత‌డు పెళ్లికి నిరాకరిస్తున్నాడు. 

మ‌రి కొంత సమయం ఆగాల‌ని అత‌డు సృజనకు చెప్పగా, త‌న‌ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తానని సృజన అత‌డికి తెలిపింది. ఈ క్ర‌మంలోనే విష పదార్థం తీసుకోవడంతో పెళ్లి జ‌రుగుతోన్న స‌మ‌యంలో ఆమె ఆరోగ్యం క్షీణించగా, ఆసుపత్రిలో చేర్పించారు. అక్క‌డే సృజ‌న‌ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.