Mumbai Indians: ముంబై చేతిలో ఓడిన ఢిల్లీ.. బెంగళూరు సంబరాలు

Delhi Capitals out from IPL and Bangalore qualifies for Playoffs
  • వెళ్తూవెళ్తూ ఢిల్లీని కూడా ఇంటికి తీసుకెళ్లిన ముంబై
  • ఢిల్లీ ఓటమితో ప్లే ఆఫ్స్‌కు బెంగళూరు
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా బుమ్రా
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతులెత్తేసింది. గత రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన రిషభ్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ ఓటమితో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. ఆ జట్టు పరాజయంతో బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. దీంతో ఇప్పుడు ప్లే ఆఫ్స్‌లో నిలిచిన నాలుగు జట్లు ఏవో స్పష్టత వచ్చేసింది. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది.

ఇక, గత రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బంతితో రాణించిన ముంబై.. ఆ తర్వాత బ్యాటింగులోనూ జోరు ప్రదర్శించింది. ఫలితంగా ఢిల్లీ నిర్దేశించిన 160 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బంది పడిన రోహిత్ శర్మ 13 బంతులు ఆడి రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా, ఆ తర్వాత బ్యాటర్లు అందరూ తలా ఓ చేయి వేయడంతో ముంబై ఖాతాలో నాలుగో విజయం చేరింది. ఇషాన్ కిషన్ 48, డెవాల్డ్ బ్రెవిస్ 37, తిలక్ వర్మ 21, టిమ్ డేవిడ్ 34, రమణ్‌దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిక్ నార్జ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఆ తర్వాత పుంజుకుంది. పంత్, రోవ్‌మన్ పావెల్ క్రీజులో ఉన్నంత వరకు స్కోరు పరుగులు తీసింది. వారి జోరు చూసి భారీ స్కోరు ఖాయమని భావించారు. అయితే, వారిద్దరూ అవుటయ్యాక పరుగులు రావడం కష్టమైంది. దీనికితోడు ముంబై బౌలర్లు ఒత్తిడి పెంచడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. పావెల్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా పృథ్వీషా 24, పంత్ 39, అక్షర్ పటేల్ 19(నాటౌట్) పరుగులు చేశారు. మూడు కీలక వికెట్లు పడగొట్టిన ముంబై బౌలర్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Mumbai Indians
Delhi Capitals
RCB
IPL 2022
Bumra
Playoff

More Telugu News