ఎఫ్3 అంటే నవ్వుల పండుగ... దిల్ రాజు నుంచి వెంకటేశ్ వరకు అందరిదీ ఇదే మాట!

21-05-2022 Sat 22:44 | Both States
  • వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్3
  • ఈ నెల 27న రిలీజ్
  • హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • సందడి చేసిన చిత్రబృందం
F3 Pre Release Event
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఎఫ్3. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు శిల్పకళావేదికలో నిర్వహించారు. చిత్రబృందం ఈ వేడుకలో సందడి చేసింది. ఎఫ్2కు రెట్టింపు మోతాదులో ఈ చిత్రంలో కామెడీ ఉంటుందని అందరూ ముక్తకంఠంతో చెప్పారు.

ఈ సినిమాను అందరూ చూడాలి: వెంకటేశ్

ఏంటమ్మా ఇదీ.. ఈ వెంకీ మామకు ఎప్పుడూ మైకు లాస్ట్ లో ఇస్తారు. నాకేమో మాటలు రావు! కరోనా ప్రభావంతో నా చిత్రాలు కొన్ని ఓటీటీకి వెళ్లిపోయాయి. ఇప్పుడు అందరినీ నవ్వించేందుకు ఎఫ్3తో థియేటర్లలోకి వస్తున్నాం. అనిల్ రావిపూడి అద్భుతమైన స్క్రిప్టు ఇచ్చాడు. ఈ సినిమాలో నాతో నటించిన అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులందరూ మెరుగైన పనితీరు కనబర్చారు. వారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాను అందరూ చూడాలి. 

ఎఫ్3లో పాత సునీల్ ను చూస్తారు: వరుణ్ తేజ్

నా అభిమానులకు, విక్టరీ వెంకటేశ్ అభిమానులకు హాయ్. ఎఫ్3 వంటి ఫ్యామిలీ ఎంటర్టయినర్ చిత్రాలు వచ్చి చాలా రోజులయింది. ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది. వెంకటేశ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్, అలీ, సునీల్, ప్రగతి... అందరూ చక్కగా నటించారు. ఎఫ్3లో పాత సునీల్ ను చూస్తారు. ఈ సినిమాలో సునీల్, నేను మామా అల్లుళ్లుగా నటించాం. మా మధ్య అద్భుతమైన కామెడీ ఉంటుంది. 

నా జీవితంలో అనిల్ రావిపూడి వంటి దర్శకుడ్ని ఎక్కడా చూడలేదు. నిజంగా బంగారం లాంటి వాడు. తాను ఎక్కడుంటే అక్కడ నవ్వులే. వెంకటేశ్ గారితో వరుసగా రెండు సినిమాల్లో నటించే అవకాశం నాకే దక్కింది. ఎఫ్2 నుంచి ఎఫ్3 జర్నీ నాకు ఎంతో హ్యాపీగా జరిగిందంటే అందుకు దర్శకుడు అనిల్, వెంకటేశ్ గారి వల్లే. మే 27న థియేటర్లలో కలుసుకుందాం.

నవ్వడం ఒక యోగం... నవ్వించడం ఒక భోగం: అనిల్ రావిపూడి

ఎఫ్2 తర్వాత కరోనా కారణంగా బ్రేక్ వచ్చింది. ఎఫ్2 చిత్రం మాకు వాస్తవానికి పెద్ద శత్రువు. ఎందుకంటే దాన్ని మించి ఉంటేనే ఎఫ్3ని ఆదరిస్తారని తెలుసు. కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం. నవ్వడం చాలా సులభం కానీ, నవ్వించడం చాలా కష్టం. ఈ సినిమా నిర్మాణంలో నాకెంతో సహకరించిన నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లకు కృతజ్ఞతలు. వాళ్లిద్దరూ నాకు కుటుంబ సభ్యుల్లాంటివాళ్లు. శిరీష్ అయితే ఎక్కడైనా నవ్వుతూనే ఉంటారు. 

ఈ సినిమాలో నటించిన వాళ్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే... ఎఫ్2లో నటించిన వాళ్లలో 80 శాతం మంది దీంట్లో కూడా నటించారు. ఈ సినిమాలో 35 మంది నటులు ఉన్నారు. వారందరిని పేరుపేరునా ఎందుకు చెబుతున్నానంటే థియేటర్లలో వాళ్లు కనిపిస్తే చప్పట్లు కొడతారు. హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, ప్రగతి, అన్నపూర్ణమ్మ, వై విజయ, రాజేంద్రప్రసాద్, సునీల్, అలీ... ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా కోసం తన సోల్ పెట్టి మరీ పనిచేశాడు. 

వరుణ్ తేజ్ నాకు ఓ బ్రదర్ లాంటివాడు. వరుణ్ ను ఎఫ్2లో ఒకలా చూస్తారు, ఎఫ్3లో మరోలా చూస్తారు. వరుణ్ లో ఇంత కామెడీ టైమింగ్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోతారు. 

వెంకటేశ్ గురించి చెప్పాలంటే ఐ లవ్యూ సర్ అని చెబుతాను. సెట్స్ పై ఎంతోమంది నటులు ఉన్నప్పుడు వాళ్లు అందించే ప్రోత్సాహం ఎనలేనిది. కామెడీ చేసేటప్పుడు ఇమేజ్ ను కూడా పట్టించుకోకుండా చేసే నటుడు వెంకటేశ్. ఎఫ్2 కంటే పదింతలు ఈ చిత్రంలో వెంకటేశ్ నవ్విస్తారు. సరిగ్గా చెప్పాలంటే... నవ్వడం ఒక యోగం... నవ్వలేకపోవడం ఒక రోగం... నవ్వించడం ఒక భోగం. కరోనా కారణంగా ఈ రెండేళ్లలో ఎంతో ఒత్తిడికి గురయ్యాం. ఇప్పుడవన్నీ వదిలేసి ఎఫ్3 రిలీజయ్యే థియేటర్లకి వెళ్లి హాయిగా నవ్వుకోండి.

ఫుల్ మీల్స్ లా ఉందని సెన్సార్ బోర్డు వాళ్లు చెప్పారు: దిల్ రాజు

ఎఫ్2 తర్వాత ఎఫ్3ని అనిల్ రావిపూడి అద్భుతంగా క్రియేట్ చేశాడు. ఎంతమందిని కావాలంటే అంతమందిని పెట్టి ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులను నవ్వించడానికే ఈ సినిమా తీశాడు. లాజిక్ ల కంటే ఈ సినిమాలో కామెడీతోనే రెండున్నర గంటల పాటు నవ్విస్తాడు. 

మాకు ఇద్దరు అద్భుతమైన హీరోలు ఉన్నారు. వాళ్లిద్దరూ నిర్మాతల కొడుకులే. వెంకటేశ్ మా రామానాయుడి గారి అబ్బాయి... వరుణ్ తేజ్ మా నాగబాబు గారి అబ్బాయి. ఎఫ్2లో ఎలా నటించారో, ఎఫ్3లోనూ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఎఫ్3లో సునీల్, అలీ వంటి కమెడియన్లు అందరినీ అలరిస్తారు. ఈ సినిమా చూసి సెన్సార్ బోర్డు సభ్యులు కూడా మెచ్చుకున్నారు. ఎఫ్3ని ఫుల్ మీల్స్ అంటూ సెన్సార్ బోర్డు అభివర్ణించింది. ఎఫ్2 కంటే ఎక్కువగా ఎఫ్3ని థియేటర్లలో ఎంజాయ్ చేస్తారు.