అమ‌రావ‌తి ఎంపీ న‌వనీత్ కౌర్‌కు మ‌రో షాక్‌..అక్ర‌మ నిర్మాణాన్ని కూల్చేయాల‌ని నోటీసులు

21-05-2022 Sat 18:31
  • హ‌నుమాన్ చాలీసా వివాదంలో కౌర్ దంప‌తుల అరెస్ట్‌
  • తాజాగా వారి ఇంటిలో అక్ర‌మ నిర్మాణం ఉందంటూ నోటీసులు
  • వారంలోగా అక్ర‌మ నిర్మాణాన్ని కూల్చేయాల‌ని ఆదేశాలు
  • లేదంటే ఆ ప‌ని తామే చేస్తామ‌న్న ముంబై న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు
Brihan Mumbai Corporation notices tomp navneet kaur rana
హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నంపై రేకెత్తిన వివాదంలో అరెస్టై ఇటీవ‌లే జైలు నుంచి విడుద‌లైన అమ‌రావ‌తి ఎంపీ న‌వ‌నీర్ కౌర్‌, ఎమ్మెల్యే ర‌వి రాణా దంప‌తుల‌కు శ‌నివారం మ‌రో షాక్ త‌గిలింది. ముంబై న‌గ‌రంలోని ఖర్ ప‌రిధిలోని కౌర్ ఇంటిలో కొంత భాగం అక్ర‌మంగా నిర్మించిన‌దేన‌ని తెలిపిన ముంబై నగ‌ర పాల‌క సంస్థ ఆమెకు నోటీసులు జారీ చేసింది. అక్ర‌మ నిర్మాణాన్ని వారంలోగా కూల్చేయాల‌ని, లేనిప‌క్షంలో తామే ఆ ప‌నిని చేప‌ట్టాల్సి వ‌స్తుంద‌ని న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు ఆ నోటీసుల్లో హెచ్చ‌రించారు. 

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే హ‌నుమాన్ చాలీసా ప‌ఠించాల‌ని డిమాండ్ చేసిన కౌర్‌.. అందుకు ఆయ‌న స‌మ్మ‌తించ‌క‌పోతే.. ఆయ‌న ఇంటి ముందు తామే హ‌నుమాన్ చాలీసాను ప‌ఠిస్తామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌త నెల‌లో సీఎం ఇంటికి వెళతార‌న్న అనుమానంతో పోలీసులు కౌర్‌తో పాటు ఆమె భ‌ర్త ర‌వి రాణాను కూడా అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌ది రోజుల త‌ర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో కౌర్ దంప‌తులు జైలు నుంచి విడుద‌ల‌య్యారు.