ఓ అభిమాని గీసిన తన బొమ్మ చూసి దిగ్భ్రాంతికి గురైన రవిశాస్త్రి

21-05-2022 Sat 17:59
  • ట్విట్టర్ లో శాస్త్రి లైవ్ చాట్
  • రవిశాస్త్రి బొమ్మ గీసిన అభిమాని
  • 2 గంటలు కష్టపడి బొమ్మ గీశానని వెల్లడి
  • వెంటనే తుడిచేసెయ్ అంటూ శాస్త్రి రిప్లయ్
Ravi Shastri asked a netizen to erase his sketch
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఎంతో సరదాగా ఉండే వ్యక్తి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. కోచ్ గా ఉన్న సమయంలోనూ జట్టులోని ఆటగాళ్లతో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగేవాడు. బయట కూడా శాస్త్రి దృక్పథంలో మార్పేమీ ఉండదు. సోషల్ మీడియాలో అభిమానులతోనూ ఫన్నీగా ఉంటారు. అయితే, ఓ నెటిజన్ వీరాభిమానం రవిశాస్త్రిని దిగ్భ్రాంతికి గురిచేసింది. 

తాజాగా రవిశాస్త్రి ట్విట్టర్ లో లైవ్ చాట్ నిర్వహించారు. 'ఇవాళ నేను మాంచి మూడ్ లో ఉన్నాను... ఏదైనా సరే నన్ను అడగొచ్చు' అంటూ చాట్ ప్రారంభించారు. దాంతో రవిశాస్త్రితో ముచ్చటించేందుకు భారీ సంఖ్యలో నెటిజన్లు ఆ లైవ్ చాట్లో వాలిపోయారు. 

ఈ సందర్భంగా మన్నన్ బాత్రా అనే అభిమాని రవిశాస్త్రి బొమ్మను గీసి ట్వీట్ చేశాడు. "సార్... రెండు గంటల సేపు కష్టపడి మీ బొమ్మ గీశాను. దయచేసి రిప్లై ఇవ్వండి" అంటూ అర్థించాడు. అయితే ఆ బొమ్మ అత్యంత ఘోరంగా ఉండడంతో రవిశాస్త్రికి ఏమనాలో తోచలేదు. చివరికి, "దయచేసి ఆ బొమ్మను అర్జెంటుగా తుడిచేసెయ్ మిత్రమా" అంటూ ఆ నెటిజన్ కు బదులిచ్చారు.

ఇతర నెటిజన్లు కూడా మన్నన్ బాత్రా గీసిన రవిశాస్త్రి బొమ్మపై వేళాకోళమాడారు. ఆ కళాఖండానికి ఎంత ధర అయినా ఇచ్చి కొంటానని ఓ అభిమాని ప్రతిపాదించగా, దాన్ని ఎన్ఎఫ్ టీ పద్ధతిలోకి మార్చితే తాను కొంటానని మరో నెటిజన్ సెటైర్లు వేశారు.
.