ముంబై ఇండియ‌న్స్ గెల‌వాలంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రార్థ‌న‌లు!... ఎందుకో తెలుసా?

21-05-2022 Sat 17:31
  • ప్లే ఆఫ్స్ నాలుగో బెర్తులో బెంగ‌ళూరు
  • నేటి మ్యాచ్‌లో ముంబై ఓడితే ఆ స్థానంలోకి ఢిల్లీ
  • అదే జ‌రిగితే బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్ గ‌ల్లంతే
this is the reason why rcb fans praying for mumbai indians victory
ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) తాజా సీజ‌న్‌లో లీగ్ ద‌శ ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. లీగ్ మ్యాచ్‌ల‌లో స‌త్తా చాటిన కొత్త జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ చేర‌గా... నిన్న‌టి మ్యాచ్‌లో చెన్నైపై విజ‌యంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు కూడా ప్లే ఆఫ్స్ చేరింది. అంత‌కుముందే మ‌రో కొత్త జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ చేర‌గా... శ‌నివారం జ‌ర‌గ‌నున్న లీగ్ మ్యాచ్ నాలుగో ప్లే ఆఫ్స్ బెర్తును ఖ‌రారు చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో విరాట్ కోహ్లీ ఆడుతున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు అభిమానులు.. టీమిండియా సార‌థి రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు గెలుపు కోసం ప్రార్థ‌న‌లు మొద‌లుపెట్టేశారు. 

బెంగ‌ళూరు జ‌ట్టు అభిమానులేంటి?.. ముంబై గెల‌వాలంటూ ప్రార్థ‌న‌లు మొద‌లుపెట్ట‌డ‌మేమిటి? అని అనుమానం వ‌స్తోంది క‌దా. ముంబై గెలిస్తే... ఇంకా ఖాళీగా ఉన్న ప్లే ఆఫ్స్ నాలుగో బెర్తులో బెంగ‌ళూరు జ‌ట్టు చేరిపోతుంది. అలా కాకుండా ముంబై ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ నుంచి బెంగ‌ళూరు జ‌ట్టు నిష్క్ర‌మించ‌క త‌ప్ప‌దు. ఈ లెక్క‌ల‌ను బేరీజు వేసుకున్న మీద‌టే బెంగ‌ళూరు జ‌ట్టు ఫ్యాన్స్ ముంబై గెల‌వాలంటూ పూజ‌లు, ప్రార్థ‌న‌లు మొదలుపెట్ట‌డంతో పాటుగా ముంబైకి మ‌ద్దతుగా సోష‌ల్ మీడియాలో పోస్టుల‌తో హోరెత్తిస్తున్నారు. 

ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్‌లో మూడు బెర్తులు ఖ‌రారు కాగా... నాలుగో స్థానంలో బెంగ‌ళూరు జ‌ట్టే ఉంది. అయితే నేడు ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై జ‌ట్టు ఢిల్లీ కేపిటల్స్ జ‌ట్టుతో త‌ల‌ప‌డుతోంది. ఎలాగూ ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్ర‌మించిన ముంబైకి ఈ మ్యాచ్ జ‌యాప‌జ‌యాల‌తో అస్స‌లు ప‌నే లేదు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడితే మాత్రం పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉన్న బెంగ‌ళూరు జ‌ట్టును కింద‌కు లాగేసి ఢిల్లీ జ‌ట్లు ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. వెర‌సి ఐపీఎల్ చరిత్ర‌లో బెంగ‌ళూరు జ‌ట్టుకు మ‌రో నిరాశ త‌ప్ప‌ద‌న్న మాట‌. 

ఒక‌వేళ నేటి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిట‌ల్స్ గెలిస్తే... 13 మ్యాచ్‌ల‌కు గానూ 7 విజ‌యాల‌తో 14 పాయింట్ల‌తో ఉన్న ఆ జ‌ట్టు తాజా విజ‌యంతో 16 పాయింట్ల‌ను సాధిస్తుంది. అయితే ఇప్ప‌టికే 14 మ్యాచ్‌లు ఆడి 8 విజ‌యాల‌తో ఉన్న బెంగ‌ళూరు జ‌ట్టు కూడా 16 పాయింట్ల‌తోనే ఉంది. కానీ, బెంగ‌ళూరు జ‌ట్టు కంటే కూడా ఢిల్లీ జ‌ట్టు ర‌న్ రేటు కాస్తంత మెరుగ్గా ఉంది. బెంగ‌ళూరు జ‌ట్టుకు -0.253 (మైన‌స్ 0.253) ర‌న్ రేటు ఉండ‌గా... ఢిల్లీ జ‌ట్టుకు మాత్రం 0.255 ర‌న్ రేటు ఉంది. దీంతో రెండు జ‌ట్ల‌కూ 16 పాయింట్లు ద‌క్కినా... బెంగ‌ళూరును కింద‌కు లాగేసి ఢిల్లీ పైకెళ్లిపోతుంది. అందుకే నేటి మ్యాచ్‌లో ముంబై జ‌ట్టు గెలవాలంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుతున్నారు.