సీఎం జగన్ లండన్ ఎందుకు వెళ్లారు?... అంటున్న టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి బుగ్గన

21-05-2022 Sat 15:50
 • సీఎం జగన్ భార్యతో లండన్ వెళ్లారంటూ టీడీపీ నేతల వ్యాఖ్యలు
 • యనమల సంస్కారహీనంగా మాట్లాడుతున్నారన్న బుగ్గన 
 • టీడీపీ మరింత దిగజారిపోయిందని విమర్శలు
Minister Buggana clarifies over CM Jagan tour to Davos
ఏపీ సీఎం జగన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు అధికారులతో కలిసి స్విట్జర్లాండ్ లోని దావోస్ తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం జగన్ అధికారులను వదిలేసి భార్యతో కలిసి లండన్ వెళ్లారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కుబేరులు ప్రయాణించే విలాసవంతమైన విమానంలో వెళ్లారంటూ విమర్శిస్తున్నారు. 

దీనిపై రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. టీడీపీ నేతలు నానాటికీ అనాగరికుల్లా తయారవుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం టీడీపీకి, వారి అనుకూల మీడియాకు ఓ అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముఖ్యంగా, యనమల తన వయసుకు తగిన విధంగా వ్యవహరిస్తే బాగుంటుందని, సిగ్గులేకుండా, సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం దావోస్ పర్యటనపై యనమల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని అన్నారు. సీఎం జగన్ దావోస్ పర్యటనలో రహస్యమేమీ లేదని బుగ్గన స్పష్టం చేశారు. అంతేకాదు, సీఎం జగన్ దావోస్ పర్యటనలో ఎప్పుడు ఏం జరిగిందీ వివరించారు.

 • సీఎం జగన్ శుక్రవారం గన్నవరం నుంచి బయల్దేరారు.
 • సీఎం విమానం మార్గమధ్యంలో ఇంధనం నింపుకునేందుకు టర్కీలోని ఇస్తాంబుల్ లో ఆగింది.
 • ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఇస్తాంబుల్ లో ఆలస్యం అయింది.
 • అక్కడ్నించి లండన్ చేరుకునే సరికి మరింత ఆలస్యం అయింది. లండన్ లో కూడా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.
 • సీఎం ప్రయాణిస్తున్న విమానం జురెక్ లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా, అప్పటికే షెడ్యూల్ సమయం (రాత్రి 10 గంటలు) దాటిపోయింది.
 • దాంతో అధికారులు ల్యాండింగ్ కోసం అభ్యర్థన చేశారు. ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్ లోని భారత ఎంబసీ అధికారులు కూడా పాల్గొన్నారు.
 • అయితే రాత్రి 10 గంటల తర్వాత జురెక్ లో విమానాల ల్యాండింగ్ ను చాలా సంవత్సరాల కిందటే నిలిపివేసినట్టు స్విట్జర్లాండ్ అధికారులు బదులిచ్చారు.
 • ఈ విషయాన్ని స్విట్జర్లాండ్ లోని భారత ఎంబసీ అధికారులు లండన్ లోని భారత దౌత్య సిబ్బందికి తెలియజేశారు. 
 • దాంతో జురెక్ లో ల్యాండయ్యే వీల్లేకపోవడంతో సీఎం జగన్ కు లండన్ లోనే బస ఏర్పాటు చేశారు.
 • అయితే, ఈ ఉదయాన్నే సీఎం జగన్ టీమ్ జురెక్ వెళ్లేందుకు సిద్ధం కాగా, డీజీసీఏ నిబంధనలు అడ్డొచ్చాయి. పైలెట్లు నిన్న అంతా ప్రయాణ విధులు నిర్వర్తించడంతో వారు నిర్ణీత సమయం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.

సీఎం ప్రయాణంలో ఈ విధమైన పరిణామాలు జరిగితే టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియాతో తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన ఆరోపించారు. తాజా విష ప్రచారంతో టీడీపీ మరింత దిగజారిపోయిన విషయం స్పష్టమైందని అన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారికి కూడా విమాన ప్రయాణాలు, అంతర్జాతీయ నియామావళి పట్ల అవగాహన లేకపోవడం దారుణం అని పేర్కొన్నారు.