ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని జైపూర్ కు మళ్లించి, దించేశారు.. అవస్థలను వివరించిన దియామీర్జా

21-05-2022 Sat 12:42
  • మూడు గంటల పాటు విమానంలోనే జాగారం
  • బ్యాగులు ఎక్కడ ఉన్నాయో కనిపించలేదన్న దియా మీర్జా
  • ప్రయాణికులకు సాయం కూడా చేయలేదని ట్వీట్
Dia Mirza accuses Vistara of not helping after her flight gets cancelled
శుక్రవారం రాత్రి ముంబై నుంచి ఢిల్లీకి వెళుతున్న విస్తారా ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీకి తీసుకెళ్లకుండా విస్తారా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ యూకే 940ను దారి మళ్లించి జైపూర్ లో దించేశారు. దీనిపై బాలీవుడ్ నటి దియామీర్జా ట్విట్టర్ పై గోడు వెళ్లబోసుకున్నారు.

శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె ఒక ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీకి వెళ్లాల్సిన యూకే 940ను దారి మళ్లించి జైపూర్ లో ల్యాండ్ చేశారు. విమానం లోపలే మూడు గంటలపాటు వేచి ఉన్నాం. ఆ తర్వాత ఫ్లయిట్ క్యాన్సిల్ అయినట్టు, కిందకు దిగిపోండని చెప్పారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ కానీ లేదా విస్తారా కానీ ఎటువంటి సాయం చేయలేదు. అడిగిన దానికి బదులు కూడా ఇవ్వలేదు. మా బ్యాగులు ఎక్కడ? అని ఆమె ట్వీట్ లో ప్రశ్నించారు.

వాతావరణం అనుకూలించకపోవడం వల్లే జైపూర్ లో ల్యాండ్ చేయాల్సి వచ్చినట్టు శుక్రవారం రాత్రి 10.37కు విస్తారా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దియా మీర్జా మాదిరే పలువురు కామెంట్ల వద్ద తమ అనుభవాలను పంచుకున్నారు. జైపూర్ లో 23 గంటల సమయంలో ల్యాండ్ అయింది. ఉదయం 2.15 గంటల వరకు విమానంలోనే ఉండిపోయాం. తర్వాత విమానం రద్దయిందని, ఢిల్లీ చేరుకునేందుకు ఎవరికి వారే సొంత ఏర్పాటు చేసుకోవాలి అంటూ చెప్పారు’’ అని ఒక ప్రయాణికుడు పోస్ట్ చేశాడు.