అధికారులను వదిలేసి భార్యతో కలసి లండన్ కు ఎందుకు వెళ్లారు?: జగన్ పై యనమల ఫైర్

21-05-2022 Sat 12:34
  • డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు వెళ్లిన జగన్
  • దావోస్ కు వెళ్లకుండా లండన్ కు వెళ్లారంటూ వార్తలు
  • చాటుమాటుగా లండన్ ఎందుకు వెళ్లారన్న యనమల
Why Jagan went to Londong with his wife asks Yanamala
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు పయనమైన జగన్ లండన్ కు వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. అధికారులతో కలిసి అధికారిక పర్యటనకు వెళ్లిన జగన్... తన భార్య భారతితో కలిసి లండన్ లో ల్యాండ్ అయ్యారని చెపుతున్నారు. ప్రత్యేక విమానంలో జగన్, భారతి, మరో వ్యక్తి మాత్రమే లండన్ కు వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎంపై విమర్శలు గుప్పించారు. 

జగన్ లండన్ కు వెళ్లడం వెనకున్న మిస్టరీ ఏమిటని యనమల ప్రశ్నించారు. దావోస్ కు వెళ్లాలనుకున్నది రాష్ట్రం కోసమా? లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? అని అడిగారు. దోచుకున్న అవినీతి సంపదను దాచుకోవడానికే వెళ్లారా? అని ప్రశ్నించారు. 

ఒకవేళ లండన్ కు వెళ్లాలనుకుంటే అధికారికంగానే వెళ్లొచ్చని... చాటుమాటుగా వెళ్లాల్సిన అవసరం ఏముందని అన్నారు. అధికారులను వదిలేసి భార్యతో కలిసి లండన్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. వ్యక్తిగత పనులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ దేశానికి వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చిందని ప్రశ్నించారు.