మరో వివాదంలో సునీల్ గవాస్కర్.. హెట్మెయర్, అతడి భార్యపై అనుచిత వ్యాఖ్యలు

21-05-2022 Sat 12:08
  • హెట్మెయర్ భార్యకు డెలివరీ అయిందంటూ కామెంట్
  • మరి, హెట్మెయర్ డెలివర్ చేస్తాడా? అంటూ వ్యాఖ్య
  • ఏం మనిషంటూ మండిపడుతున్న నెటిజన్లు
  • గతంలో అనుష్క శర్మపైనా ఇలాంటి వ్యాఖ్యలే
Sunil Gavaskar Surrounds Yet another Controversy Over Unpleasant Remarks On Hetmeyer Wife
టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వెస్టిండీస్ క్రికెటర్ షిమ్రాన్ హెట్మెయర్, అతడి భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. నిన్న చెన్నైసూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా హెట్మెయర్ ప్రదర్శనపై గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

మ్యాచ్ కు కామెంటరీ చేస్తున్న సందర్భంగా ఆయన.. ‘‘హెట్మెయర్ భార్యకు డెలివరీ అయింది. మరి, రాయల్స్ కోసం హెట్మెయర్ డెలివర్ చేస్తాడా?’’ అంటూ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఏం మనిషి ఈయన!’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మాటలు ఎలా అంటారంటూ విమర్శిస్తున్నారు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదని ఆగ్రహిస్తున్నారు. ఆయన కామెంటరీనే వినాలని ఉండదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

‘‘సునీల్ గవాస్కర్ కామెంటరీనా! వామ్మో నా వల్ల కాదు. అప్పుడు విరాట్.. ఇప్పుడు హెట్మెయర్. గవాస్కర్ మాటల్లో లింగభేదం లేకపోవచ్చుగానీ.. ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలు, వారి భార్యల గురించి మాట్లాడడం మాత్రం దారుణం’’ అని ఓ నెటిజన్ ఫైర్ అయ్యారు. 

‘‘సునీల్ గవాస్కర్ నోటి నుంచి ఇలాంటి మాట రావడం దయనీయం. అంతకుముందు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలపై ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడేమో హెట్మెయర్, అతడి భార్యపై కామెంట్ చేశారు. ఇలాంటి వ్యక్తిని కామెంటరీ బాక్స్ లో కూర్చోబెట్టినందుకు స్టార్ స్పోర్ట్స్ ఇండియా కూడా కొంచెం సిగ్గుపడాలి’’ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు. గవాస్కర్ తన పాపాలకుగానూ మూల్యం చెల్లించేలా చేసేందుకు హెట్మెయర్ త్వరగా అవుటై కామెంటరీ బాక్స దగ్గరకు వెళ్తున్నాడంటూ ఓ యూజర్ ఎద్దేవా చేశారు. 

కాగా, అంతకుముందు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల మీద కూడా సునీల్ గవాస్కర్ ఇలాగే నోరు పారేసుకుని అబాసుపాలయ్యారు. ‘‘లాక్ డౌన్ లో కేవలం అనుష్క శర్మ బౌలింగ్ నే ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. నేను ఆ వీడియోను చూశాను. కానీ, అసలైన క్రికెట్ కు అది మాత్రం సరిపోదు’’ అంటూ కామెంట్ చేశారు. దీనిపై అనుష్క శర్మ వెంటనే స్పందించారు కూడా. సునీల్ గవాస్కర్ ను గౌరవిస్తూనే.. ఆ కామెంట్లు చేయడం పట్ల ప్రశ్నలు సంధించింది. 

కాగా, ఈ నెల 10న హెట్మెయర్ భార్య ప్రసవించింది. దీంతో రాజస్థాన్ బబుల్ ను వీడిన హెట్మెయర్ గయానాకు వెళ్లాడు. కొన్ని రోజుల పాటు వారి తొలి బిడ్డ, భార్య దగ్గర ఉండి వచ్చాడు. ఈ క్రమంలోనే అతడి ప్రదర్శన గురించి గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.