దసరా రేసులో నిఖిల్ .. 'స్పై'

21-05-2022 Sat 11:44
  • వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నిఖిల్
  • రిలీజ్ కి రెడీగా ఉన్న '18 పేజెస్' .. 'కార్తికేయ 2'
  • యాక్షన్ థ్రిల్లర్  గా సెట్స్ పై ఉన్న 'స్పై'
  • దసరాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న టీమ్
Spy Movie Update
అనుకోకుండానే నిఖిల్ కి అభిమానులతో చాలా గ్యాప్ వచ్చేసింది. 'అర్జున్ సురవరం' తరువాత ఆయన నుంచి ఇంతవరకూ మరో సినిమా రాలేదు. దాంతో ఇక వరుస సినిమాలను థియేటర్లలో దింపే దిశగా ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రాలుగా '18 పేజెస్' .. ' కార్తికేయ 2' ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతున్నాయి.

ఈ సినిమాలు విడుదలకు రెడీ అవుతూ ఉండగానే ఆయన మరో సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు .. ఆ సినిమా పేరే 'స్పై'. ఈడీ ఎంటర్టైన్ మెంట్  సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. చకచకా ఈ సినిమా షూటింగును జరుపుకుంటోంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 

ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ విటేకర్ పనిచేస్తుండటం విశేషం. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. నిఖిల్ కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం.