Balakrishna: 365 రోజుల పాటు ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. తెలుగు జాతికి బాలకృష్ణ లేఖ!

Nandamuri Balakrishna will launch NTR 100th birth anniversary celebrations in Nimmakuru
  • మే 28న ఎన్టీఆర్ శత జయంతి
  • నిమ్మకూరులో వేడుకలను ప్రారంభించనున్న బాలకృష్ణ
  • నేల నలుచెరగులా వేడుకలు జరగనున్నాయన్న బాలయ్య
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిని మహోన్నత వ్యక్తి, సినీ నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. శత జయంతి ఉత్సవాలను ఆయన జన్మస్థలం నిమ్మకూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతోంది. 

ఇక ఈ వేడుకలను మే 28న నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. మే 28 నుంచి వచ్చే ఏడాది అంటే 2023 మే 28 వరకు వేడుకలను ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ 'శత పురుషుని శత జయంతి ఉత్సవాలు' పేరిట ఓ లేఖను విడుదల చేశారు. 

"అభిమానులకు, తెలుగు నేలకు, విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి.... నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి.. 

మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయ సినిమా తెలుగు సినిమాని తలఎత్తి చూసింది. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు సంస్కృతి తలఎత్తి నిలబడింది. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది. ఆ రోజు నుంచి 2023 మే 28 వరకు... 365 రోజుల పాటు శత పురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచెరగులా జరగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది. ఆనందంతో పాలుపంచుకుంటుంది. 

మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్లి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను. వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను నా చేతుల మీదుగా ప్రారంభిస్తాను. 365 రోజులు... వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు, నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు... ఈ మహత్కార్యాన్ని పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్లి మహానాడులో పాల్గొంటానని తెలుగు జాతికి తెలియజేస్తున్నాను. 

అహర్నిశలు మీ అభిమానం కోసం... మీ నందమూరి బాలకృష్ణ" అంటూ లేఖలో పేర్కొన్నారు. 
Balakrishna
Telugudesam
100th Birth Anniversary
NTR
Tollywood

More Telugu News