డ్రైవర్ల ట్రిప్ రద్దుకు పరిష్కారం కనుగొన్న ఊబర్

21-05-2022 Sat 10:49
  • డెస్టినేషన్ ముందే తెలిసేలా ఏర్పాటు
  • చెల్లింపుల విధానం కూడా ముందే తెలుస్తుంది
  • ట్రిప్ రద్దులను నివారించేందుకు ఊబర్ కొత్త విధానం
Tired of Uber drivers canceling your ride New policy solves the issue
ఊబర్ క్యాబ్ బుక్ చేసుకుంటే.. కొద్ది సమయం వృథా అయిన తర్వాత డ్రైవర్లు ట్రిప్ రద్దు చేస్తే ఎంతో కోపం వస్తుంది. వీరి చర్యల కారణంగా ప్రయాణికులు రైళ్లు, బస్సు సర్వీసులను మిస్ అయిన సందర్భాలు బోలెడు. అయితే, ఊబర్ దీనికి ఒక పరిష్కారం కొనుగొంది. సాధారణంగా యూజర్ల లొకేషన్ సమీపంలోని క్యాబ్ లను ఊబర్ సిస్టమ్ గుర్తించి, వారికి ట్రిప్ ను ఆఫర్ చేస్తుంది. సమీపంలో మూడు ట్యాక్సీలు అందుబాటులో ఉంటే ముగ్గురికీ ట్రిప్ సందేశం కనిపిస్తుంది. ఎవరు ఓకే చేస్తే వారికి అలాట్ అవుతుంది.

ఇప్పటి వరకు ప్రయాణికులు ఉన్న చోటకు వచ్చి ట్రిప్ ప్రారంభిస్తేనే తీసుకెళ్లాల్సిన గమ్యస్థానం (డెస్టినేషన్) తెలిసేది. కానీ, ఇకపై ట్రిప్ ప్రారంభంలోనే డ్రైవర్లకు డెస్టినేషన్ కూడా తెలిసేలా ఊబర్ చర్యలు తీసుకుంది. దీంతో తమకు సమ్మతమైతే వారు దాన్ని స్వీకరించొచ్చు. లేదంటే ఆ ట్రిప్ ను వారు ముందే క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీనివల్ల వినియోగదారులకు ట్రిప్ క్యాన్సిల్ చార్జీలు పడకుండా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ ఏర్పాటు లేకపోవడంతో క్యాబ్ డ్రైవర్లు ఫోన్ చేసి డెస్టినేషన్ కనుక్కున్న తర్వాత రద్దు చేస్తున్నారు. దీంతో ట్రిప్ రద్దు చార్జీలు యూజర్లపై పడుతున్నాయి. దీనికి పరిష్కారమే కొత్త విధానం. 

ఇక నగదు రూపంలో ఇస్తేనే వస్తామనే వారు కొందరు. ఆన్ లైన్ పేమెంట్ అయితే ఊబర్ నుంచి తమకు రావడం ఆలస్యమవుతుందని డ్రైవర్లు చెబుతుంటారు. దీంతో ట్రిప్ తీసుకోవడానికి ముందే ఆ ట్రిప్ కు సంబంధించి ఏ రూపంలో చెల్లించేది ముందే తెలిసేలా ఊబర్ చర్యలు తీసుకుంది.