ఫోర్ కొట్టి ఏడుసార్లు ఛాతీని చరుచుకున్న రవిచంద్రన్ అశ్విన్.. వీడియో వైరల్

21-05-2022 Sat 10:13
  • చివరి ఓవర్‌లో ఫోర్ కొట్టాక సంబరాలు
  • మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన అశ్విన్
  • తనలోని వార్నర్‌ను బయటకు తెచ్చానన్న అశ్విన్
Brought out the David Warner inside me Ravi Ashwin
రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్‌తో అశ్విన్ అదరగొట్టాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అంతకుముందు బౌలింగులో ప్రమాదకర ఆటగాడు డెవోన్ కాన్వే (16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.  

ఈ అద్భుత ఇన్నింగ్స్‌ను పక్కనపెడితే మైదానంలో అతడు చేసుకున్న సెలబ్రేషన్ ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అశ్విన్..  చివరి ఓవర్‌లో ఫోర్ కొట్టిన తర్వాత ఛాతీని ఏడుసార్లు కొట్టుకుని సంబరాలు చేసుకున్నాడు. బంతి బౌండరీ లైన్‌ను తాకిందో, లేదో గుండెను చరుచుకుంటూ అతడు సంబరాలు చేసుకోవడం కెమెరాకు చిక్కింది. ఇప్పుడా వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు, మ్యాచ్ ముగిసిన అనంతరం అశ్విన్ మాట్లాడుతూ.. తనలోని డేవిడ్ వార్నర్‌ను బయటకు తెచ్చానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.