Uttar Pradesh: పది రోజులుగా తల్లి మృతదేహంతోనే కుమార్తె.. దుర్వాసన రావడంతో వెలుగులోకి

  • ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘటన
  • యువతి మానసిక స్థితి సరిగా లేదని గుర్తింపు
  • బాధిత మహిళ హెచ్ఏఎల్‌లో ఇంజినీర్‌గా పనిచేసి రిటైరయ్యారన్న పోలీసులు
  • పదేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు
  • కేన్సర్‌తో బాధపడుతున్నట్టు చెప్పిన పోలీసులు
Lucknow girl stays home for over 10 days with mothers corpse

తల్లి మృతదేహంతో పది రోజులపాటు గడిపిందో యువతి. ఆ  ఇంట్లో నుంచి వస్తున్న దుర్వాసనను భరించలేని ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తల్లి మృతదేహంతో గడిపిన ఆ యువతిని 26 ఏళ్ల అంకిత దీక్షిత్‌గా గుర్తించారు. తల్లి మృతి చెందిన విషయాన్ని ఆమె తమ బంధువులకు కూడా చెప్పకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి తల్లి సునీత దీక్షిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌ (హెచ్ఏఎల్)లో ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్ అయినట్టు గుర్తించారు. పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నప్పుడు ముఖ్య ద్వారానికి తాళం వేసి ఉంది. అయితే, లోపలి నుంచి యువతి మాటలు వినిపించడంతో పోలీసులు తలుపు తట్టారు. అయితే, డోర్ తెరిచేందుకు అంకిత నిరాకరించింది. పోలీసులను చూసి నిరసన తెలిపింది. దీంతో మరో గత్యంతరం లేని పోలీసులు కార్పెంటర్‌ను పిలిపించి తలుపు తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు. 

లోపల అంకిత ఒక గదిలో ఉండగా, మరో గదిలో ఆమె తల్లి మృతదేహం కనిపించింది. అంకిత మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు.  తొలుత మాట్లాడలేకపోయిన అంకిత.. ఆ తర్వాత పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ఆమెను చనిపోయిన మహిళ కుమార్తెగా గుర్తించారు. సునీత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. సునీత దీక్షిత్ పదేళ్ల క్రితమే భర్త రజనీష్ దీక్షిత్ నుంచి విడాకులు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె కేన్సర్‌తో బాధపడినట్టు పేర్కొన్నారు.

More Telugu News