దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలన్నదే సంఘ్‌ పరివార్ లక్ష్యం: అసదుద్దీన్ ఒవైసీ

21-05-2022 Sat 07:52
  • జ్ఞాన్‌వాపి, మధుర విషయాల్లో సంఘ్ ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోందన్న ఎంఐఎం చీఫ్
  • బాబ్రీ మసీదు ఘటన పునరావృతం అవుతుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నారన్న ఒవైసీ
  • ఎన్‌కౌంటర్లకు తాను వ్యతిరేకమని స్పష్టీకరణ
asduddin owaisi fires on sangh parivar on gyanvapi masjid row
దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలని సంఘ్ పరివార్ యోచిస్తోందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన ఒవైసీ... జ్ఞాన్‌వాపి, మధుర వంటి విషయాల్లో సంఘ్ పరివార్ ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ్ ఈ దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలని చూస్తోందని విమర్శించారు.

జ్ఞాన్‌వాపి మసీదును వివాదంలోకి లాగడంతో బాబ్రీ మసీదు వంటి ఘటన పునరావృతం అవుతుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నారని ఒవైసీ అన్నారు. జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారంలో కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. అలాగే, దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమంటూ జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదించడంపై ఒవైసీ స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్లకు తాను వ్యతిరేకమని పేర్కొన్నారు.