భాగ్య‌న‌గ‌రిలో మ‌రో ప‌రువు హ‌త్య‌... బేగం బ‌జార్‌లో యువ‌కుడి దారుణ హ‌త్య‌

20-05-2022 Fri 21:28
  • బేగం బ‌జార్ మ‌చ్చి మార్కెట్‌లో ఘ‌ట‌న‌
  • నీర‌జ్‌పై న‌లుగురు వ్య‌క్తుల మూకుమ్మ‌డి దాడి
  • 20 క‌త్తి పోట్లు పొడ‌వడంతో నీర‌జ్ అక్క‌డిక‌క్క‌డే మృతి
  • ఏడాది క్రిత‌మే ప్రేమ వివాహం చేసుకున్న నీర‌జ్‌
  • కేసును దర్యాప్తు చేస్తున్న షాహీనాథ్ గంజ్ పోలీసులు
another honour killing in hyderabad
హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం రాత్రి మ‌రో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్నాడ‌న్న క‌క్ష‌తో నీర‌జ్ ప‌న్వార్ అనే యువ‌కుడిపై న‌లుగురు వ్య‌క్తులు క‌త్తులతో దాడికి దిగారు. ఒకేసారి న‌లుగురు వ్య‌క్తులు మూకుమ్మ‌డిగా జ‌రిపిన ఈ దాడిలో నీర‌జ్ ప‌న్వార్ అక్క‌డికక్క‌డే చ‌నిపోయాడు. 

ప్రేమ పెళ్లి చేసుకున్నాడ‌న్న కార‌ణంగా ఇటీవ‌లే నాగ‌రాజు అనే యువ‌కుడిని అత‌డి భార్య సోద‌రుడు ప‌ట్ట ప‌గ‌లు న‌డిరోడ్డుపై చంపేసిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే... అదే త‌ర‌హాలో న‌గ‌రంలో రెండో ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. కేవలం 15 రోజుల వ్య‌వ‌ధిలోనే ఇలాంటి ఘ‌ట‌న‌లు రెండు చోటుచేసుకున్న వైనంపై న‌గ‌ర జ‌నం భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

తాజా ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. బేగం బ‌జార్ ప‌రిధిలోని మ‌చ్చి మార్కెట్‌లో ఓ యువ‌కుడిపై న‌లుగురు వ్య‌క్తులు క‌త్తులతో విచ‌క్ష‌ణారహితంగా దాడికి దిగారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితులు క‌త్తుల‌తో 20 పోట్లు పొడ‌వ‌డంతో బాధితుడు అక్క‌డికక్క‌డే చ‌నిపోయాడు. ఆ త‌ర్వాత నిందితులు బైక్‌పై ప‌రార‌య్యారు. 

స‌మాచారం అందుకున్న పోలీసులు వ‌చ్చి వివ‌రాలు సేక‌రించ‌గా... మృతుడు నీర‌జ్ ప‌న్వ‌ార్ అని తేలింది. ఏడాది క్రిత‌మే అత‌డు ఓ యువ‌తిని ప్రేమ వివాహం చేసుకున్నాడ‌ట‌. అప్ప‌టి నుంచి అత‌డిపై యువ‌తి కుటుంబం క‌క్ష పెంచుకుంద‌ని స‌మాచారం. ఈ ప్రాథ‌మిక స‌మాచారంతో షాహీనాథ్ గంజ్ పోలీసులు మృత‌దేహాన్ని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.