తెలంగాణ‌లో పోలీసు ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుకు గ‌డువు పొడిగింపు

20-05-2022 Fri 20:20
  • శుక్ర‌వారంతో ముగియ‌నున్న పోలీసు ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు గ‌డువు
  • ఈ నెల 26 వ‌ర‌కు గ‌డువును పొడిగించిన ప్రభుత్వం
  • అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్న ఎమ్మెల్సీ ప‌ల్లా
police recruitment applications accepted upto 26 th of this month in telangana
తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి కేసీఆర్ స‌ర్కారు శుక్ర‌వారం మూడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. పోలీసు ఉద్యోగార్థుల వ‌యో ప‌రిమితిని రెండేళ్ల పాటు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ప్రభుత్వం... గ్రూప్ 1లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్న డీఎస్పీ పోస్టుల అభ్య‌ర్థుల ఎత్తును 165 సెంటీ మీట‌ర్ల‌కు త‌గ్గించింది. తాజాగా పోలీసు ఉద్యోగాల ద‌రఖాస్తుల‌కు శుక్ర‌వారంతో ముగియ‌నున్న గ‌డువును పొడిగిస్తూ ప్ర‌భుత్వం శుక్ర‌వారం సాయంత్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇలా ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి శుక్ర‌వారం ఒకే రోజు ప్ర‌భుత్వం మూడు కీల‌క నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించింది.

పోలీసు ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుల గ‌డువును ప్ర‌భుత్వం ఈ నెల 26వ‌ర‌కు పొడిగించింది. ఈ నెల 26 ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు పోలీసు ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేశారు. ఈ అవ‌కాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలంటూ ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.