ఆ మూడు పార్టీల‌తో ప్ర‌జాశాంతి పార్టీకి పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

20-05-2022 Fri 18:11
  • తాను ప్ర‌శ్నిస్తేనే కేసీఆర్ స్పందిస్తున్నారన్న పాల్ 
  • వ‌యో ప‌రిమితిని 31 ఏళ్ల‌కు పెంచ‌మంటే కేసీఆర్ 32 ఏళ్ల‌కు పెంచారని వ్యాఖ్య 
  • ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, జ‌న‌సేన‌ల‌తో పొత్తు ఉండ‌ద‌న్న కేఏ పాల్‌
praja shanthi party chief k a paul comments on alliance in telangana assembly elections
మ‌రో ఏడాదిన్న‌ర‌లో తెలంగాణ అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌పై క్రైస్త‌వ మ‌త బోధ‌కుడు, ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, జ‌న‌సేన‌ల‌తో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల వారికి చెందిన ఏకైక పార్టీ ప్ర‌జాశాంతి పార్టీయేన‌ని చెప్పిన పాల్‌... త‌మ పార్టీ మిన‌హా రాష్ట్రంలో ఇప్పుడున్న అన్ని పార్టీల‌పైనా జ‌నంలో వ్య‌తిరేక‌త ఉంద‌ని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డానికి నియోజ‌క‌వ‌ర్గాల్లో తానే ప‌ర్య‌టిస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పారు.

పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి అభ్య‌ర్థుల వ‌యో ప‌రిమితిని పెంచుతూ శుక్ర‌వారం సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై స్పందించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన సంద‌ర్భంగా కేఏ పాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌యో ప‌రిమితి పెంపుపై తాను ప్ర‌శ్నిస్తేనే కేసీఆర్ స్పందించార‌ని కూడా చెప్పారు. తాను 31 ఏళ్ల‌కు పెంచ‌మ‌ని చెబితే.. కేసీఆర్ ఏకంగా 32 ఏళ్ల‌కు పెంచార‌ని కేఏ పాల్ తెలిపారు.