మీది షరతుల్లేని ప్రేమ... ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా: ఎన్టీఆర్

20-05-2022 Fri 17:41
  • నేడు ఎన్టీఆర్ జన్మదినం
  • 39వ పుట్టినరోజు జరుపుకున్న యంగ్ టైగర్
  • గత రాత్రి నుంచే అభిమానుల కోలాహలం
  • ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్
NTR statement on his birthday
ఇవాళ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఎన్టీఆర్ 39వ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం అంబరాన్నంటుతోంది. గత రాత్రి నుంచే హైదరాబాదులో ఎన్టీఆర్ నివాసం వద్ద ఫ్యాన్స్ సందడి మొదలైంది. సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు... ఎక్కడ చూసినా తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న పోస్టులే దర్శనమిచ్చాయి. అభిమానులు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా విషెస్ తెలిపారు. 

ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సినీ రంగ సహచరులు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. అంతేకాకుండా, తనకు విషెస్ చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వివరించారు. 

"మీ అభిమానం నా హృదయాన్ని తాకింది... ఇవాళ్టి నా పుట్టినరోజుకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది" అని పేర్కొన్నారు. అయితే, అభిమానులు తనను క్షమించాలని, తాను ఇంటి వద్ద లేకపోవడం వల్ల కలుసుకోలేకపోయానని ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు. "నిష్కల్మషమైన మీ ప్రేమ, మద్దతు, దీవెనలతో ధన్యుడ్ని అయ్యాను. సదా మీకు రుణపడి ఉంటాను" అంటూ అభిమానుల పట్ల తన ప్రేమను చాటుకున్నారు.
.