కోలీవుడ్ యంగ్ హీరో జోడీగా సాయిపల్లవి!

20-05-2022 Fri 17:16
  • కోలీవుడ్లో దూసుకుపోతున్న శివ కార్తికేయన్ 
  • ఆయన హీరోగా సినిమాను నిర్మిస్తున్న కమల్
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా 
  • కథానాయికగా సాయిపల్లవి ఎంపిక
Saipallavi in Shivakarthikeyan Movie
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా సాయిపల్లవికి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఈ మధ్య  కాలంలో ఆమె చేసిన 'లవ్ స్టోరీ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత సినిమాగా ప్రేక్షకులను పలకరించడానికి 'విరాటపర్వం' రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తమిళంలో ఒక సినిమా చేయడానికి సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. 

కోలీవుడ్ యంగ్ హీరోల్లో శివ కార్తికేయన్ ఇప్పుడు మాంఛి జోష్ తో ఉన్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఆయన ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా ఒక సినిమా చేయడానికి ఆయన రంగంలోకి దిగారు. సోనీ పిక్చర్స్ తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'మావీరన్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో శివ కార్తికేయన్ .. ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సాయిపల్లవిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.