Navjot Singh Sidhu: కోర్టులో లొంగిపోయిన కాంగ్రెస్ నేత న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ

  • లొంగిపోయేందుకు స‌మ‌యం ఇవ్వాలంటూ సిద్ధూ పిటిష‌న్‌
  • పిటిష‌న్‌పై తాము విచార‌ణ చేప‌ట్ట‌లేమ‌న్న సుప్రీంకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం
  • సీజే బెంచ్‌ను ఆశ్ర‌యించాలంటూ సూచ‌న‌
  • ప‌టియాల కోర్టు ముందు లొంగిపోయిన సిద్ధూ
navjot singh sidhu surrenders in patiala court

మాజీ క్రికెట‌ర్‌, కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌, ఆ పార్టీ పంజాబ్ శాఖ మాజీ అధ్య‌క్షుడు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప‌టియాల జిల్లా కోర్టు ముందు లొంగిపోయారు. 1988లో న‌మోదైన ఓ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా త‌క్ష‌ణ‌మే కోర్టు ముందు లొంగిపోవాల‌ని కూడా సిద్ధూకు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సూచించింది. 

ఈ నేప‌థ్యంలో కోర్టు ముందు లొంగిపోవ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పిన సిద్ధూ... అనారోగ్య కార‌ణాల వ‌ల్ల తాను లొంగిపోయేందుకు కొంత స‌మ‌యం ఇవ్వాలంటూ శుక్ర‌వారం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను విచారించిన జ‌స్టిస్ ఖన్విల్క‌ర్‌, జ‌స్టిస్ పార్ధివాలాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం... ఈ కేసులో ప్ర‌త్యేక బెంచ్ తీర్పు ఇచ్చినందున ఈ పిటిష‌న్‌పై తాము విచార‌ణ చేప‌ట్ట‌లేమ‌ని తేల్చేసింది. 

సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ ను ఆశ్ర‌యించాల‌ని సూచించింది. సుప్రీంకోర్టు నుంచి ఈ మాట వినిపించినంత‌నే శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఇంటి నుంచి బ‌య‌లుదేరిన సిద్ధూ..ప‌టియాల కోర్టు ముందు లొంగిపోయారు.

More Telugu News