సోనియాతో కిర‌ణ్ కుమార్ రెడ్డి భేటీ

20-05-2022 Fri 16:40
  • 3 రోజులుగా ఢిల్లీలోనే కిర‌ణ్ కుమార్ రెడ్డి
  • 45 నిమిషాల పాటు జ‌రిగిన భేటీ
  • భేటీలో చ‌ర్చ‌కు వచ్చిన అంశాలు వెల్ల‌డి కాని వైనం
  • సోనియాతో భేటీ త‌ర్వాత హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరిన న‌ల్లారి
nallari kiran kumar reddy meets sonia gandhi in delhi
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీతో ఉమ్మ‌డి ఏపీ చివ‌రి సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేర‌కే 3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన కిర‌ణ్ కుమార్ రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండిపోయారు. సోనియాతో భేటీ త‌ర్వాతే తిరుగు ప‌య‌నం అవ్వాలని భావించిన కిర‌ణ్ కుమార్ రెడ్డి... ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం సోనియాతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంత‌రం ఆయ‌న కాసేప‌టి క్రితం హైద‌రాబాద్ తిరుగుప‌య‌‌న‌మ‌య్యారు. 

ఢిల్లీకి వెళ్లిన రోజు వ్య‌క్తిగ‌త ప‌నుల నిమిత్త‌మే ఇక్క‌డికి వ‌చ్చాన‌ని చెప్పిన కిర‌ణ్ కుమార్ రెడ్డి... ఆ త‌ర్వాత అస‌లు మీడియాకే క‌నిపించ‌లేదు. తాజాగా సోనియాతో భేటీ అయిన త‌ర్వాత కూడా ఆయ‌న మీడియాతో మాట్లాడ‌లేదు. ఈ భేటీలో సోనియా, కిర‌ణ్ కుమార్ రెడ్డిలు దాదాపుగా 45 నిమిషాల పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించుకున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ భేటీలో ఏఏ అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింద‌న్న విష‌యం మాత్రం వెల్ల‌డి కాలేదు.