YSRCP: ఎంపీ సీటుకు రూ.200 కోట్లయినా ఇచ్చే వాళ్లున్నారు: వైసీపీ రాజ్య‌స‌భ అభ్యర్థి బీద మ‌స్తాన్ రావు

  • రూ.10 కోట్లు, రూ.100 కోట్ల‌తోనే కాలం గ‌డిచిపోతుందా? అని ప్రశ్నించిన మస్తాన్ రావు 
  • అధికారంలో ఉన్న వైసీపీకి డ‌బ్బుతో ప‌నేమిటని ఎదురుప్రశ్న 
  • పిల్లి సుభాస్ చంద్ర‌బోస్‌, మోపిదేవి ఎంత ఇచ్చి ఉంటారు? అంటూ వ్యాఖ్య 
  • ఆర్.కృష్ణ‌య్య ఆర్థిక ప‌రిస్థితి అంద‌రికీ తెలిసిందేగా? అన్న మ‌స్తాన్ రావు
beeda mastan rao comments on cash for rajyasabha seats

వైసీపీలో చేరిన అన‌తి కాలంలోనే రాజ్య‌స‌భ సీటు ద‌క్కించుకున్న ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌, బీఎంఆర్ గ్రూప్ అధినేత బీద మ‌స్తాన్‌ రావు... రాజ్య‌స‌భ సీట్ల‌ను ఆయా పార్టీలు అమ్మేసుకుంటున్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డ‌బ్బుల‌కే రాజ్య‌స‌భ సీట్లు ద‌క్కుతాయ‌నుకుంటే... రూ.100 కోట్టు కాదు.. రూ.200 కోట్లు కూడా ఇచ్చేందుకు చాలా మందే ఉన్నార‌ని ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

టీడీపీతోనే రాజ‌కీయ ప్రస్థానం మొద‌లుపెట్టిన బీద మ‌స్తాన్ రావు... 2019 ఎన్నిక‌ల తర్వాత వైసీపీలో చేరిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏపీ కోటాలో త్వ‌ర‌లో ఖాళీ కానున్న 4 రాజ్య‌సభ సీట్ల కోసం న‌లుగురు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన వైసీపీ... అందులో ఓ సీటుకు బీద మ‌స్తాన్ రావును ఎంపిక చేసింది.

  ఈ సందర్భంగా మ‌స్తాన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాజ్య‌స‌భ సీట్ల‌ను ఒక్కో దానిని రూ.100 కోట్ల‌కు అమ్ముకుందంటూ వైసీపీపై టీడీపీ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రూ.100 కోట్లు తీసుకుని ఎంపీ టికెట్ ఇచ్చేలా ఉంటే... రూ.200 కోట్లు ఇచ్చేందుకైనా ఓసీ అభ్య‌ర్థులు సిద్ధంగా ఉంటారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న వైసీపీకి డ‌బ్బుతో ప‌నేమిటి? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. రూ.10 కోట్లు, రూ.100 కోట్ల‌తోనే కాలం గ‌డిచిపోతుందా? అని కూడా ఆయ‌న అన్నారు. గ‌తంలో పిల్లి సుభాస్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ల‌కు కూడా రాజ్య‌సభ సీట్లిచ్చారు క‌దా... వారెంత మేర డ‌బ్బు ఇచ్చి ఉంటార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇక త‌న‌తో పాటు రాజ్య‌స‌భ సీటు ద‌క్కిన ఆర్.కృష్ణ‌య్య ఆర్థిక ప‌రిస్థితి ఏమిటో అంద‌రికీ తెలిసిందేన‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News