Youtube: యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ‘మోస్ట్ రీప్లేడ్’ ఫీచర్ ఇప్పుడు అందరికీ!

  • వీడియో మొత్తాన్ని చూడకుండానే అవసరమైన కంటెంట్‌ను మాత్రమే చూసే వెసులుబాటు
  • ఇప్పటి వరకు ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి 
  • ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానున్న ఫీచర్
Youtube bringing most replayable feature to all Users

సాధారణ యూజర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ‘మోస్ట్ రీప్లేడ్’ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఫీచర్ వల్ల వీడియో మొత్తాన్ని చూసే అవసరం లేకుండా అందులోని ముఖ్యమైన భాగాన్ని మాత్రమే వీక్షించే వీలుంటుంది. సాధారణంగా యూట్యూబ్ వీడియోల నిడివి ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యమైన సమాచారం మాత్రం 10 నుంచి 30 సెకన్ల లోపే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే మొత్తం వీడియోను చూడాల్సి ఉంటుంది.

అయితే, మోస్ట్ రీప్లేడ్ ఫీచర్ వల్ల ఈ బాధ తప్పుతుంది. చూడాలనుకున్న వీడియోలోని ఏ భాగాన్ని యూజర్లు ఎక్కువగా చూశారో ఈ ఫీచర్ చూపిస్తుంది. దీంతో దానిని మాత్రమే చూసే వెసులుబాటు లభిస్తుంది. ఫలితంగా సమయంతోపాటు డేటా కూడా ఆదా అవుతుంది.

ఇప్పటి వరకు ప్రీమియం సబ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ఇకపై సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. డెస్క్‌టాప్, మొబైల్ వెర్షన్ రెండింటిలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. చూడాలనుకుంటున్న వీడియోలోని ఏ భాగాన్ని యూజర్లు ఎక్కువగా చూశారో అక్కడ బార్ గ్రాఫ్ పెద్దదిగా కనిపిస్తుంది. ఫలితంగా యూజర్లు సులభంగా ఆ భాగాన్ని చూడొచ్చు. కాగా, ఈ ఫీచర్‌తో పాటు మరిన్ని అప్‌డేట్‌లు, కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్టు యూట్యూబ్ తెలిపింది.

More Telugu News