రతన్ టాటా ఇలాంటి కారులో వస్తారని ఎవరూ ఊహించరు... వీడియో ఇదిగో!

19-05-2022 Thu 19:17
  • ముంబయి తాజ్ హోటల్ కు విచ్చేసిన రతన్ టాటా
  • నానో కారులో రాక.. అందరిలోనూ ఆశ్చర్యం!
  • నిరాడంబరతకు నిదర్శనంలా రతన్ టాటా
  • ఇప్పటికీ నానోపై చెక్కుచెదరని అభిమానం!
Ratan Tata comes to Taj Hotel in Nano Car
వ్యాపార దిగ్గజం రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్షల కోట్ల టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించిన వ్యక్తి. వ్యక్తిగతంగా వేల కోట్ల సంపదకు సొంతదారు. అలాంటి వ్యక్తి కాలు కిందపెట్టాల్సిన పనుండదు. కానీ రతన్ టాటా తీరే వేరు. ఆయన ఆడంబరాలకు దూరంగా ఉంటారు. తాజాగా ఆయన నిరాడంబరత మరోసారి వెల్లడైంది. 

ఈ నెల 17వ తేదీ సాయంత్రం ముంబయి తాజ్ హోటల్ వద్దకు ఓ నానో కారు వచ్చి ఆగింది. భారత్ లో అత్యంత చవకైన కారు అదే! తాజ్ హోటల్ అంటే చెప్పేదేముంది... సెలబ్రిటీలు కోటీశ్వరులు బస చేసే స్టార్ హోటల్. ఆ హోటల్ లోకి కారు ఎంటరైందంటే అది ఏదో ఒక ఫారెన్ బ్రాండ్ కారే అయ్యుంటుందని ఓ నమ్మకం! అలాంటి చోటకు ఓ నానో కారు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కారులోంచి రతన్ టాటా దిగడంతో మరింత ఆసక్తి కలిగింది. 

ఈ పరిణామంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. సాధారణ సౌకర్యాలతో కూడిన, నిడివి తక్కువగా ఉండే నానో కారులో రతన్ టాటా వంటి వ్యాపార దిగ్గజం వస్తాడని అక్కడున్న వారెవరూ ఊహించలేదు. ఆ సమయంలో ఆయన వెంట భద్రతా సిబ్బంది కూడా లేరు. ఎంతో నిరాడంబరంగా విచ్చేసిన రతన్ టాటాను అక్కడి వాళ్లు తమ ఫోన్లలో బంధించారు. 

అప్పట్లో నానో కారును ఎంతో సమున్నతమైన ఉద్దేశంతో టాటా గ్రూపు మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ నిర్ణయం వెనుక సాధారణ తరగతి ప్రజలకు కూడా కారు ఉండాలన్న సంకల్పం ఉంది. రెండున్నర లక్షల రూపాయలతో కారును వినియోగదారుకు అందించాలని నాడు రతన్ టాటా ప్రణాళికలు రచించారు. కానీ, మార్కెట్లో నానో కారుకు ప్రజారదణ దక్కలేదు. కాలక్రమంలో ఆ కారు తెరమరుగైంది. 

అయినప్పటికీ, రతన్ టాటా తన మానసపుత్రిక వంటి నానో కారుపై అభిమానాన్ని మాత్రం కోల్పోలేదు. టాటా గ్రూపు కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రఖ్యాత మోడల్ కారు ఉన్నప్పటికీ, ఆయన మనసంతా నానోపైనే ఉంటుందనడానికి ఈ సంఘటనే నిదర్శనం.