టీఆర్ఎస్‌ను వీడిన మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు.. భార్య‌తో క‌లిసి కాంగ్రెస్‌లో చేరిక‌

19-05-2022 Thu 16:58
  • చెన్నూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓదెలు విజయం
  • ప్ర‌భుత్వ విప్‌గానూ వ్య‌వ‌హ‌రించిన నేత‌
  • జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్‌గా భాగ్య‌ల‌క్ష్మికి ఇంకా రెండేళ్ల ప‌ద‌వీ కాలం
  • ప్రియాంకా గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిక‌
nallala odelu resigns trs and joined into congress party
తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆ మ‌రుక్ష‌ణ‌మే మంచిర్యాల జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న త‌న స‌తీమ‌ణి భాగ్య‌ల‌క్ష్మితో క‌లిసి ఢిల్లీ వెళ్లిన ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో క‌లిసి ఓదెలు దంప‌తులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ స‌మ‌క్షంలో వారు కాంగ్రెస్‌లో చేరిపోయారు.

తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ వెన్నంటి సాగిన ఓదెలు 2009లో చెన్నూరు నుంచి టీఆర్ఎస్ త‌ర‌ఫున‌ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి 2010లో మ‌ళ్లీ అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవత‌రించాక 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న చెన్నూరు నుంచే ఎమ్మెల్యేగా గెలిచి ప్ర‌భుత్వ విప్‌గా ప‌నిచేశారు. 

అయితే 2018 ఎన్నిక‌ల్లో కేసీఆర్ చెన్నూరు టికెట్‌ను పార్టీ యువ‌నేత బాల్క సుమ‌న్‌కు ఇచ్చి ఓదెలును ప‌క్క‌న‌పెట్టారు. నాటి నుంచి పార్టీకి దూరంగానే ఉంటూ వ‌స్తున్న ఆయన గురువారం నాడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదిలా ఉంటే... భ‌ర్త‌తో క‌లిసి కాంగ్రెస్‌లో చేరిన భాగ్య‌ల‌క్ష్మి జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్‌ ప‌ద‌వి ఇంకా రెండేళ్ల పాటు ఉంది. అయినా కూడా వారు లెక్క చేయ‌కుండా కాంగ్రెస్‌లో చేరిపోవ‌డం గ‌మ‌నార్హం.