మూడేళ్లుగా ఏం పీక్కుంటున్నారు... నా త‌ప్పేమిటో చెప్పండి: ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు

19-05-2022 Thu 16:44
  • జీఏడీలో రిపోర్ట్ చేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు
  • విజ‌య‌వాడ‌లో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించిన సీనియ‌ర్ ఐపీఎస్‌
  • నేను చేసిన త‌ప్పేమిటో చెప్పండని డిమాండ్‌
  • మూడేళ్లుగా ఏం చేశారంటూ స‌జ్జ‌ల‌కు ప్ర‌శ్న‌
ab venkateswara rao comments in media conference
రెండేళ్ల‌కు పైబ‌డి సస్పెన్ష‌న్‌లో ఉండి సుప్రీంకోర్టు ఆదేశాలతో సుదీర్ఘ విరామం త‌ర్వాత సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు గురువారం తిరిగి విధుల్లో చేరారు. టీడీపీ హ‌యాంలో ఇంటెలిజెన్స్ డీజీగా ప‌నిచేసిన వెంక‌టేశ్వ‌ర‌రావు నిఘా ప‌రిక‌రాల కొనుగోలు కేసులో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ వైసీపీ ప్ర‌భుత్వం ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. 

సస్పెన్ష‌న్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయ‌న, అక్కడ అనుకూలంగా తీర్పు రావడంతో త‌న‌కు పోస్టింగ్ ఇవ్వాలంటూ రెండు సార్లు అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి వెళ్లడం.. ఈ నేప‌థ్యంలో ఆయనపై ప్ర‌భుత్వం స‌స్పెన్షన్ ఎత్తివేయ‌డం తెలిసిందే. ఈ క్రమంలో విధుల్లో చేరేందుకు గురువారం ఆయ‌న స‌చివాల‌యానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జీఏడీలో రిపోర్ట్ చేసిన ఆయ‌న ఆ త‌ర్వాత విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఐపీఎస్ అధికారిగా తాను చేసిన ప‌లు ప‌నుల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. రాజ‌కీయ నేత‌ల‌పై త‌ప్పుడు కేసులు పెట్టేందుకు య‌త్నించిన పోలీసుల‌ను ఇట్లాంటి వెధ‌వ ప‌నులు చేయొద్ద‌ని వారించాన‌ని ఆయ‌న తెలిపారు. ఇందులో భాగంగా 75 ఏళ్ల వ‌య‌సులో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం కింద‌ కేసు న‌మోదు చేసేందుకు య‌త్నించిన పోలీసులను తాను వారించాన‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయ‌న్న ఆయ‌న‌.. తాను విప‌క్షానికి వ‌త్తాసు ప‌లుకుతున్నానంటూ ఆరోప‌ణ‌లు కూడా చేశారన్నారు. 

ఇక త‌న స‌స్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వులు అసంపూర్ణంగా వున్నాయని వెంక‌టేశ్వ‌ర‌రావు తెలిపారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేసేందుకే తాను సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌ను క‌లిసేందుకు య‌త్నించాన‌ని తెలిపారు. అయితే త‌న‌ను క‌లిసేందుకు స‌మీర్ శ‌ర్మ విముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతో జీఏడీలో రిపోర్ట్ చేశాన‌న్నారు. రిపోర్ట్ చేయ‌డం వ‌ర‌కే త‌న ప‌ని అని పేర్కొన్న ఏబీ.. పోస్టింగ్ విష‌యం ప్ర‌భుత్వ ప‌రిధిలోనిదేన‌న్నారు. అయినా తాను ఏం త‌ప్పు చేశానో నిగ్గు తేల్చాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. 

ఇక ప్రభుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న మీద చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ, మూడేళ్లుగా ఏం పీక్కున్నారంటూ వెంకటేశ్వరరావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తానేదో త‌ప్పు చేశాన‌ని చెబుతున్న వారు.. ఆ త‌ప్పు ఏమిట‌న్న విష‌యాన్ని చెప్పాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. 

ఇప్ప‌టికే మూడేళ్లు గ‌డిచిపోయింద‌ని, స‌మ‌యం ముగుస్తోంద‌ని కూడా ఆయ‌న స‌జ్జ‌ల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. త‌న‌తో క‌లిసి ప‌నిచేసిన చాలా మంది కింది స్థాయి పోలీసుల‌ను ఏళ్ల త‌ర‌బ‌డి వీఆర్‌లో పెట్టార‌ని, వారికి క‌నీసం వేత‌నాలు కూడా ఇవ్వ‌డం లేద‌ని వెంక‌టేశ్వ‌ర‌రావు ఆరోపించారు. త‌ప్పు చేసిన వారిని శిక్షించాల్సిందేన‌న్న ఏబీ... అందుకు తాను కూడా మిన‌హాయింపేమీ కాద‌న్నారు. అయితే చేసిన త‌ప్పును నిర్ధారించి శిక్ష అమ‌లు చేయాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.