Woman: గుజరాతీయులకు ఈవిడే 'అమ్మలగన్న అమ్మ'... పురావస్తు తవ్వకాల్లో వందల ఏళ్ల నాటి మహిళ అస్థిపంజరం లభ్యం

  • వాద్ నగర్ లో తవ్వకాలు
  • ఘస్కోల్ ప్రాంతంలో పలు అస్థిపంజరాలు 
  • మహిళ అస్థిపంజరం 4వ శతాబ్దం నాటిదిగా గుర్తింపు
  • గుజరాతీయుల డీఎన్ఏతో మహిళ డీఎన్ఏ సరిపోలిన వైనం
Woman skeleton found in Vadnagar

గుజరాత్ లోని వాద్ నగర్ వద్ద పురావస్తు తవ్వకాల్లో ఓ అసంపూర్ణ అస్థిపంజరం లభ్యమైంది. వాద్ నగర్ పట్టణంలోని ఘస్కోల్ ప్రాంతంలో తవ్వకాలు సాగించిన భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) శాస్త్రవేత్తలు వందల ఏళ్ల నాటి ఆ అస్థిపంజరాన్ని వెలికి తీశారు. అది ఓ మహిళ అస్థిపంజరంగా గుర్తించారు. 

డీఎన్ఏ పరీక్షల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం వెల్లడింది. గుజరాత్ లోని అత్యధిక ప్రజల డీఎన్ఏతో ఆ మహిళ డీఎన్ఏ సరిపోలింది. ఆ లెక్కన సదరు స్త్రీమూర్తి గుజరాతీయులకు అమ్మలగన్న అమ్మ అయివుంటుందని, ఆ మహిళ వారసుల నుంచే గుజరాత్ జనాభా విస్తృతమై ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు. 

లక్నో డీఎన్ఏ ల్యాబ్ అధిపతి డాక్టర్ నీరజ్ రాయ్ దీని గురించి వివరిస్తూ, సాధారణ గుజరాతీ వ్యక్తుల్లో ఉండే డీఎన్ఏ, మహిళ డీఎన్ఏ ఒకేలా ఉన్నాయని వివరించారు. ఈ అస్థిపంజరం ద్వారా గుజరాత్ ప్రజల పుట్టుక మూలాలకు సంబంధించి కీలక సమాచారం లభించినట్టయిందని వెల్లడించారు. మహిళ అస్థిపంజరం 4వ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఆ మహిళకు ఎలాంటి జబ్బులు లేవని పేర్కొన్నారు. 

అటు, తవ్వకాల్లో పాలుపంచుకున్న పురావస్తు నిపుణుడు డాక్టర్ అభిజిత్ అంబేకర్ స్పందిస్తూ, వాద్ నగర్ లో లభించిన అనేక అస్థిపంజరాలు ఆసక్తికర సమాచారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. కూర్చుని ఉన్న స్థితిలో ఓ అస్థిపంజరం లభ్యమైందని, బహుశా దాని మూలాలు బీహార్, లేక ఉత్తరప్రదేశ్ లోని గంగా పరీవాహక ప్రాంత మైదానాల్లో ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే ప్రాంతంలో కొన్ని బౌద్ధ మతగురువుల అస్థిపంజరాలు కూడా లభ్యమయ్యాయని వివరించారు. ఇక్కడ బౌద్ధ మతగురువుల సమూహం కూడా నివసించి ఉంటుందనడానికి ఇవి ఆధారాలు అని తెలిపారు.

More Telugu News