Navjot Singh Sidhu: రోడ్డుపై గొడవ ఘటన కేసులో... సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు

  • 1988 నాటి కేసులో సిద్ధూకు జైలు శిక్ష
  • సిద్ధూ కొట్టిన దెబ్బలకు గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి చనిపోయాడంటూ అభియోగం 
  • 2006లో సిద్ధూకు మూడేళ్ల జైలుశిక్షను విధించిన హైకోర్టు 
  • 2018లో జైలుశిక్షను రద్దు చేసి రూ.1000 జరిమానా విధించిన సుప్రీం  
  • రివ్యూ పిటిషన్ ను విచారించి, తాజాగా శిక్ష విధించిన సుప్రీంకోర్టు
Navjot Singh Sidhu sentenced for 1 year jail

పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన ఘటనలలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ కొట్టారు. ఆయన కొట్టిన దెబ్బలు గుర్నామ్ తలకు బలంగా తగలడంతో ఆయన చనిపోయారు. ఈ కేసులోనే సిద్ధూకు సుప్రీంకోర్టు శిక్షను విధించింది.

ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ పాటియాలాలోని సెషన్స్ కోర్టు 1999 సెప్టెంబర్ 22న సిద్ధూని, అతని అనుచరుడుడిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును మృతుడి కుటుంబ సభ్యులు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు. కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం సిద్ధూని దోషిగా ప్రకటిస్తూ, ఆయనకు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ 2006లో తీర్పును వెలువరించింది. 

దీంతో 2018లో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా జరిగిన విచారణ అనంతరం, సిద్ధూ హత్య చేశారనడానికి ఆధారాలు లేవంటూ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ, సీనియర్ సిటిజన్ ను గాయపరిచినందుకు రూ.1000 జరిమానా మాత్రం విధించింది. 

అయితే, దీనిని సవాల్ చేస్తూ బాధిత కుటుంబం సుప్రీంలో అదే ఏడాది రివ్యూ పిటిషన్ వేయగా, కేసును విచారించిన కోర్టు నేడు ఆయనకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.  

More Telugu News