Madhya Pradesh: రూ. 11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చేసిన ఆభరణాల వ్యాపారి.. కుమారుడితో కలిసి ఆధ్యాత్మిక మార్గంలోకి..

rakesh surana initiation jewellery trader donates 11 crores property and walked on path of renunciation
  • ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని గోశాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు రాసిచ్చేసిన రాకేష్ సురానా
  • 11 ఏళ్ల కుమారుడితో కలిసి ఈ నెల 22న దీక్ష
  • ఆయన నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు
  • రథంపై ఊరేగించిన జైన సమాజం

ఉదయం లేచింది మొదలు చాలామంది దృష్టి అంతా డబ్బు సంపాదనపైనే ఉంటుంది. అందులో తప్పేం లేదు. ఎందుకంటే ‘ధనం మూలం ఇదం జగత్’ అని ఎప్పుడో చెప్పారు మన పెద్దలు. అయితే, కొందరికి మాత్రం ఎంత సంపాదించినా తనివి తీరదు. ఇంకా, ఇంకా సంపాదనవైపే మొగ్గుచూపుతుంటారు.

 అయితే, అందరూ అలాగే ఉండరని, డబ్బులో కంటే ఆధ్యాత్మిక మార్గంలోనే జీవితానికి అర్ధం, పరమార్థం దొరుకుతాయని భావించిన ఓ బులియన్ వ్యాపారి తన జీవిత కాలంలో సంపాదించిన రూ. 11 కోట్ల ఆస్తిని విరాళంగా రాసిచ్చేసి తన 11 ఏళ్ల కుమారుడితో కలిసి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. 

ఆయన పేరు రాకేష్ సురానా. బులియన్ వ్యాపారి. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన ఆయన తన రూ. 11 కోట్ల విలువైన ఆస్తిని గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు విరాళంగా రాసిచ్చేశారు. భార్య లీనా (36), కుమారుడు అమయ్ (11)తో కలిసి లౌకిక జీవితాన్ని త్యజించి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 

ఈ క్రమంలో ఈ నెల 22న జైపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరు ముగ్గురు దీక్ష తీసుకోనున్నారు. గురుమహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాకేశ్ తెలిపారు. కాగా, ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జైన సమాజం  రాకేశ్, భార్య, కుమారుడిని రథంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నిజానికి కుమారుడు నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక బాట పట్టాలని నిర్ణయించుకున్నామని, కానీ మరీ చిన్నవాడు కావడంతో ఏడేళ్లపాటు ఎదురుచూశామని రాకేష్ తెలిపారు. అమెరికాలో చదువుకున్న తన భార్యకు కూడా ఆధ్యాత్మిక జీవితంపై ఆసక్తి ఉందని పేర్కొన్నారు. 

బాలాఘాట్‌లో చిన్నపాటి బంగారం, వెండి నగల దుకాణం ప్రారంభించిన రాకేష్.. వ్యాపారంలో క్రమంగా అభివృద్ధి సాధించి కోట్లకు పడగలెత్తారు. పేరు, కీర్తి రెండూ లభించాయి. అయితే,  జీవితంలో ఇంతకుమించినదేదో వెతుక్కోవాలని భావించిన ఆయన కుటుంబం ఆధ్యాత్మిక బాట పట్టింది.

  • Loading...

More Telugu News