IPL 2022: ఐపీఎల్‌లో స‌రికొత్త రికార్డు... వికెట్ ప‌డ‌కుండా 20 ఓవ‌ర్లు ఆడిన ల‌క్నో జట్టు

  • 140 ప‌రుగుల‌తో చెల‌రేగిన డికాక్‌
  • కెప్టెన్ కేఎల్ రాహుల్ ఖాతాలో 68 ప‌రుగులు
  • కోల్‌క‌తా విజ‌య‌ల‌క్ష్యం 211 ప‌రుగులు
lsg new record in ipl history

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో బుధ‌వారం ఓ స‌రికొత్త రికార్డు న‌మోదైంది. ఒక్క‌టంటే ఒక్క వికెట్ కూడా న‌ష్ట‌పోకుండా పూర్తిగా 20 ఓవ‌ర్లు ఆడిన జ‌ట్టుగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు స‌రికొత్త రికార్డును త‌న‌పేరిట లిఖించుకుంది. తాజా సీజ‌న్‌లోనే ల‌క్నో జ‌ట్టు అరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి సీజ‌న్‌లోనే స‌త్తా చాటుతున్న జ‌ట్టుగా ల‌క్నో ప్ర‌శంస‌లు అందుకుంటుండ‌గా...తాజాగా ఇప్ప‌టిదాకా ఏ ఒక్క జ‌ట్టుకు సాధ్యం కాని రికార్డును ఆ జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. 

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ల‌క్నో జ‌ట్టు... త‌న బ్యాటింగ్ స‌త్తా ఏమిటో నిరూపించింది. ల‌క్నో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో క‌లిసి ప్రారంభించిన స్టార్ బ్యాట‌ర్ క్వింట‌న్ డికాక్‌... త‌న బ్యాట్ ప‌వ‌రేమిటో చూపాడు. 

70 బంతుల‌ను ఎదుర్కొన్న డికాక్‌... 10 ఫోర్లు, 10 సిక్స్‌ల‌తో వీర విహారం చేశాడు. జ‌ట్టు స్కోరు 210 కాగా.. అందులో 140 ప‌రుగులు అత‌డొక్క‌డే చేశాడు. ఇక డికాక్‌కు పూర్తి స‌హ‌కారం అందించిన కేఎల్ రాహుల్‌.. 51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 68 ప‌రుగులు రాబ‌ట్టాడు. మ‌రికాసేప‌ట్లో కోల్‌క‌తా జ‌ట్టు 211 ప‌రరుగుల విజ‌య‌ల‌క్ష్యంతో త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.

More Telugu News