Mathura: ఇది శ్రీకృష్ణుని జన్మస్థానం.. ఈ మసీదులో నమాజు చేయకుండా ఆపండి: మథుర కోర్టులో దాఖలైన పిటిషన్

  • మథురలోని షాహీ ఈద్గా మసీదుపై స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు
  • మసీదు ఉన్న ప్రాంతం శ్రీకృష్ణుడి జన్మస్థలమని పేర్కొన్న పిటిషనర్లు
  • పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు
 Petetion filed in Mathura court to stop performing namaz in Shahi Edga masjid

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. హిందూ ఆలయాన్ని కొంత భాగం కూలగొట్టి ఆ ప్రాంతంలో మసీదు నిర్మించారనే అంశంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి వీడియో సర్వే జరిగింది. నివేదిక ఇంకా కోర్టుకు అందాల్సి ఉంది.

ఇక ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఉన్న షాహీ ఈద్గా మసీదుపై స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మసీదు ఉన్న ప్రాంతం శ్రీకృష్ణుడి జన్మస్థలమని ఇద్దరు న్యాయవాదులు పిటిషన్ వేశారు. మసీదు నిర్మాణానికి ముందు ఈ స్థలంలో దేవాలయం ఉండేదని పిటిషన్ లో వారు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ, హిందూ దేవాలయం అవశేషాలపై మసీదును నిర్మించారని చెప్పారు. ఇక్కడ మసీదు ఉండటంలో ఎలాంటి ఔచిత్యం లేదని అన్నారు. శ్రీకృష్ణుడి ఆలయంలో కొంత భాగాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూల్చేశాడని... ఆ తర్వాత అక్కడ మసీదును నిర్మించారని చెప్పారు. మసీదులో నమాజ్ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించాలని కోర్టును కోరినట్టు తెలిపారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు... జులై 1న విచారణ జరుపుతామని తెలిపింది. 

మరోవైపు ఈ మసీదును తొలగించాలని కోరుతూ గతంలోనే 10 పిటిషన్లు మథుర కోర్టులో దాఖలయ్యాయి. ఇటీవల యూపీకి జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన వాగ్దానాల్లో మథుర ఆలయం కూడా ఉండటం గమనార్హం.

More Telugu News