Apex Court: ‘అసాధారణ అధికారాలు’ వాడుకున్న సుప్రీంకోర్టు.. రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి పెరారివాలన్ ను విడుదల చేయాలని ఆదేశాలు

Apex Court Orders Central Govt To Release Rajiv Gandhi Assailant Perarivalan
  • ఆర్టికల్ 142ను ప్రయోగించిన ధర్మాసనం
  • వెంటనే విడుదల చేయాలంటూ కేంద్రానికి ఆదేశం
  • రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని వ్యాఖ్య
  • మార్చి 9న బెయిల్ ఇచ్చిన ధర్మాసనం
రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన ఏజీ పెరారివాలన్ ఎట్టకేలకు విడుదల కాబోతున్నాడు. వెంటనే అతడిని విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పీల్ మేరకు ఆ కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇదే కేసులో నళినిని విడుదల చేశారు. ఇప్పుడు పెరారివాలన్ కూ జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మోక్షం కలిగించింది. 

ఆర్టికల్ 142 ప్రకారం అసాధారణ అధికారాలను ఉపయోగించుకుని పెరారివాలన్ ను విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుని పెరారివాలన్ ను విడుదల చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని వివరించింది. కాగా, పెరారివాలన్ 31 ఏళ్లుగా జైలులో ఉంటున్నాడని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. ఈ ఏడాది మార్చి 9న బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్ లో రాజీవ్ గాంధీని థాను అనే మహిళా మానవ బాంబుతో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 1999 మేలో పెరారివాలన్, మురుగన్, శాంతం, నళినిలకు సుప్రీంకోర్టు ఉరి శిక్ష విధించింది. అయితే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నళిని ఉరి శిక్షను తమిళనాడు గవర్నర్ నిలిపివేశారు. 

పెరారివాలన్, మురుగన్, శాంతంలకు విధించిన ఉరి శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ 2014 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వారి క్షమాభిక్ష పిటిషన్ పై 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న కారణంగా సుప్రీం ధర్మాసనం నాడు ఆ తీర్పునిచ్చింది. 

కాగా, పెరారివాలన్ విడుదల సందర్భంగా అతడి తల్లి అర్పుతమ్ అమ్మళ్ భావోద్వేగానికి లోనైంది. అతడిని విడుదల చేయించేందుకు ఆమె ఏళ్లతరబడి పోరాడింది. ఇప్పుడు విడుదలకు ఆదేశాలు రావడంతో ఆమె ఇంటి వద్ద సందడి నెలకొంది. మరోవైపు రాజీవ్ గాంధీ వర్ధంతికి కొన్నిరోజుల ముందే ఇలాంటి తీర్పు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Apex Court
Supreme Court
Rajiv Gandhi
Perari Valan
Tamilnadu

More Telugu News