Volodymyr Zelenskyy: నియంతలు అంతం కాక తప్పదు: కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో జెలెన్‌స్కీ వీడియో సందేశానికి స్టాండింగ్ ఒవేషన్!

Dictators will die says Zelenskyy in video message at Cannes
  • 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో వీడియో లింక్ ద్వారా ప్రసంగించిన జెలెన్‌స్కీ
  • ‘అపోకలిప్స్ నౌ’, ‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమాలను ప్రస్తావించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
  • ప్రజల నుంచి లాక్కున్న అధికారం తిరిగి వారి చేతుల్లోకే వస్తుందని ధీమా
  • కేన్స్‌లో పలు ఉక్రేనియన్ సినిమాల ప్రదర్శన
75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభ వేడుకలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీకి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. వీడియో లింక్ ద్వారా కీవ్ నుంచి ప్రసంగించిన ఆయన తెరపై కనిపించగానే హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రేనియన్లకు సినీ ప్రపంచం అండగా నిలవాలని, సంఘీభావం తెలపాలని కోరారు. సినిమా-వాస్తవికత మధ్య ఉన్న సంబంధంపై సుదీర్ఘంగా మాట్లాడిన జెలెన్‌స్కీ ఈ సందర్భంగా 1979లో వచ్చిన ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాల సినిమా ‘అపోకలిప్స్ నౌ’, 1940లో వచ్చిన చార్లీచాప్లిన్ సినిమా ‘ది గ్రేట్ డిక్టేటర్’లను ప్రస్తావించారు. 

‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమాను ఉటంకిస్తూ.. ‘‘మనుషుల మధ్య విద్వేషం నశించిపోతుంది. నియంతలు అంతమవుతారు. ప్రజల నుంచి లాక్కున్న అధికారం తిరిగి ప్రజల చేతుల్లోకి వస్తుంది’’ అని జెలెన్‌స్కీ నొక్కి చెప్పారు. మన కాలపు సినిమా నిశ్శబ్దంగా లేదని చాటిచెప్పే మరో కొత్త చార్లీ చాప్లిన్ కావాలని అన్నారు. వారి భవిష్యత్ సినిమాపైనే ఆధారపడి ఉందని చెప్పిన జెలెన్‌స్కీ.. నేడు సినిమా నిశ్శబ్దంగా లేదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ప్రజల చేతుల్లోంచి లాక్కున్న అధికారం తిరిగి వారికే దక్కుతుందని స్పష్టం చేశారు. జెలెన్‌స్కీ ప్రసంగానికి ప్రతి ఒక్కరు లేచి నిలబడి చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. 

12 రోజులపాటు జరగనున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సెర్గీ లోజ్నిట్సా డాక్యుమెంటరీ ‘ది నేచురల్ హిస్టరీ ఆఫ్ డిస్ట్రక్షన్’ సహా ఉక్రెయిన్‌కు చెందిన పలు సినిమాలను ప్రదర్శిస్తారు. యుద్ధం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో లిథువేనియన్ చిత్ర నిర్మాత మాంటాస్ క్వేదరవియస్ మృతి చెందారు. మరణానికి ముందు ఆయన చిత్రీకరించిన ఫుటేజీని ఆయన కాబోయే భార్య హన్నా బిలోబ్రోవా కేన్స్‌లో ప్రదర్శించనున్నారు. 

కాగా, ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న జెలెన్‌స్కీ అంతర్జాతీయ ఈవెంట్‌లో కనిపించడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో జరిగిన 64వ వార్షిక గ్రామీ అవార్డుల సందర్భంగానూ ఆయన ఓ వీడియో సందేశాన్ని అందించారు. తన దేశానికి మద్దతు ఇవ్వాలని కోరిన ఆయన యుద్ధం కారణంగా ఆవరించిన నిశ్శబ్దాన్ని సంగీతంతో పూరించాలని కళాకారులను కోరారు.
Volodymyr Zelenskyy
Ukraine
Russia
75th Cannes Film Festival

More Telugu News