Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు జాక్ పాట్.. రెట్టింపు కానున్న వేతనాలు

CEO Satya Nadella says Microsoft is almost doubling salaries as company
  • ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల లేఖ
  • మెరిట్ బడ్జెట్ రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటన
  • మైక్రోసాఫ్ట్ సేవలకు డిమాండ్ ఉన్నట్టు వెల్లడి
  • అది మీరు అందిస్తున్న సేవల వల్లేనని ప్రశంస
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు త్వరలోనే భారీగా వేతనాలు పెరగనున్నాయి. పెద్ద ఎత్తున రాజీనామాల (గ్రేట్ రిజిగ్నేషన్) సంస్కృతికి చెక్ పెట్టడంతోపాటు, నిపుణులైన వారిని కాపాడుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ మెయిల్ చేశారు. 

గ్లోబల్ మెరిట్ బడ్జెట్ ను రెట్టింపు చేయనున్నట్లు ఆయన మెయిల్ లో పేర్కొన్నారు. బడ్జెట్ రెట్టింపు చేయడం అంటే ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచుతున్నట్టు తెలుస్తోంది. కెరీర్ మధ్యలో ఉన్న వారికి చెల్లింపుల కోసం మరింత మొత్తాన్ని కేటాయించనున్నట్లు సత్య నాదెళ్ల చెప్పారు. 

ఉద్యోగులను కాపాడుకునేందుకు ప్రముఖ కంపెనీలు ఇటీవలి కాలంలో వేతనాలను భారీగా పెంచుతుండడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు.. అమెజాన్ సైతం ఫిబ్రవరిలో భారీ వేతన పెంపులను ప్రకటించింది. బేసిక్ పేను 1,60,000 డాలర్ల నుంచి 3,50,000 డాలర్లు చేసింది. 

ఉద్యోగుల వేతన చెల్లింపులపై తాము పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయనున్నట్టు సత్య నాదెళ్ల ఉద్యోగులకు పంపిన మెయిల్ లో పేర్కొన్నారు. ‘‘మన నైపుణ్యాలకు ఎంతో డిమాండ్ నెలకొంది. మన భాగస్వాములు, కస్టమర్ల సాధికారతకు మీరు అందిస్తున్న అద్భుతమైన సేవల వల్లే. అందుకు మీకు పెద్ద ధ్యాంక్స్. మీ ప్రతి ఒక్కరిపై మేము దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెడుతున్నాం’’ అని మెయిల్ లో నాదెళ్ల వివరించారు.
Microsoft
CEO
Satya Nadella
salaries

More Telugu News