Kannada TV: వికటించిన ప్లాస్టిక్ సర్జరీ.. యువ కన్నడ నటి మృతి

Kannada TV actress Chethana Raj 21 dies during plastic surgery at a private hospital
  • ఇంట్లో చెప్పకుండా సర్జరీకి వెళ్లిన చేతన 
  • చికిత్స తర్వాత క్షీణించిన ఆరోగ్యం
  • దీంతో తుది శ్వాస విడిచిన నటి
  • వైద్యుల నిర్లక్ష్యం వల్లేనన్న తల్లిదండ్రులు 
  • పోలీసు కేసు నమోదు
అందమైన ఆకృతి కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించిన యువ కన్నడ టీవీ నటి, 21 ఏళ్ల చేతన రాజ్ ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె ప్రాణాలు విడిచినట్టు సమాచారం. ఫ్యాట్ ఫ్రీ సర్జరీకి అంగీకారం తెలిపి, మే 16న ఉదయం శస్త్రచికిత్స కోసం ఆమె ఆసుపత్రిలో చేరింది.  

సర్జరీ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. సాయంత్రం సమయానికి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం మొదలైంది. ఆ తర్వాత ఆమె పరిస్థితి మరింత విషమించగా, వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ విషయాన్ని చేతన తన తల్లిదండ్రులకు చెప్పకుండా.. స్నేహితులతో కలసి ఆమె ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం.

వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె అకాల మరణానికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. పోస్ట్ మార్టమ్ కోసం చేతన మృతదేహాన్ని రామయ్య హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తోంది. పోలీసులు హాస్పిటల్ కు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. సబ్బు బ్రాండ్లు గీత, దోరెసాని ప్రకటనల్లో నటించిన చేతన కన్నడ ప్రజల్లో ఎక్కువ మందికి పరిచయం.
Kannada TV
actress
Chethana Raj
dies
plastic surgery

More Telugu News