Karnataka: కర్ణాటకలో ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ ప్రధానికి రక్తంతో లేఖరాసిన అభ్యర్థులు

Karnataka Candidates Write Letter in Blood to PM Modi
  • డబ్బున్న వారికే ప్రభుత్వ ఉద్యోగమన్న విధానం వచ్చేసిందన్న అభ్యర్థులు 
  • అక్రమాల వల్ల కష్టపడి చదువుకున్న వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన
  • న్యాయం జరగకుంటే నక్సల్స్‌లో చేరుతామని స్పష్టీకరణ 
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ
కర్ణాటకలో ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అభ్యర్థులు రక్తంతో లేఖ రాశారు. ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్రంగా విచారించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలని అందులో డిమాండ్ చేశారు. 

అక్రమ మార్గంలో ఎస్సై పోస్టుకు ఎంపిక కావాలనుకున్న వారి వల్ల కష్టపడి చదివి, పరీక్షల్లో ఎంపికైన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని,  వారికి అన్యాయం జరగకుండా చూడాలని ఆ లేఖలో అభ్యర్థులు కోరారు. ప్రధానమంత్రి మోదీపై తమకు అపారమైన గౌరవం ఉందని, దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 

రాష్ట్రంలో డబ్బులున్న వారికే ప్రభుత్వ ఉద్యోగమన్న విధానం వచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థులు, దీనివల్ల తాము మానసికంగా చచ్చిపోయామని అన్నారు. అంతేకాదు, ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరిగితే నక్సల్స్‌లో చేరుతామని కూడా ఆ లేఖలో హెచ్చరించారు. మొత్తం ఎనిమిది మందిమి కలిసి లేఖ రాశామని అందులో పేర్కొన్నప్పటికీ వారి పేర్లు కానీ, ఫోన్ నంబర్లు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు. కర్ణాటకలో ఇప్పుడీ లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Karnataka
PSI recruitment scam
Blood Letter
Narendra Modi

More Telugu News