Jagan: నేడు భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న జగన్!

  • కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఇంటెగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • 5,230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతున్న ప్రాజెక్టు
  • ప్రాజెక్టు కోసం 4,766 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం
Jagan to perform land breaking ceremony for power project in Kurnool district

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తాండా వద్ద ఇంటెగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన కర్నూలుకు బయల్దేరుతారు. అక్కడి నుంచి నేరుగా ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 

ఈ ప్రాజెక్టును గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ (పంప్డ్ స్టోరేజ్) ను ఉత్పత్తి చేయనుండటం ఈ ప్రాజెక్టు విశేషం. ఒకే యూనిట్ నుంచి మూడు విభాగాల ద్వారా ఇన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. 

ఈ ప్రాజెక్టు ద్వారా 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్, 550 మెగావాట్ల విండ్, 1,680 మెగావాట్ల హైడల్ విద్యుత్ ను ఉత్పత్తి చేయబోతున్నారు. ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాల భూమిని కంపెనీకి అప్పగించారు.

More Telugu News