Ravela Kishore Babu: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు!

  • గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కిశోర్ బాబు
  • సోము వీర్రాజుకు రాజీనామా లేఖను పంపిన మాజీ మంత్రి
  • టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం
Ravela Kishore Babu resigns BJP

ఏపీలో ఎదగాలని భావిస్తున్న బీజేపీకి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి రావెల్ కిశోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కిశోర్ బాబు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయినప్పటికీ గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.  

ఐఆర్ఎస్ అధికారిగా పని చేసిన రావెల కిశోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చంద్రబాబు ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టి సముచిత స్థానాన్ని కల్పించారు. అయితే ఆ తర్వాత పలు కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవిని కోల్పోయారు. 

2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి... జనసేనలో చేరారు. మళ్లీ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. అయితే, ఆయన మళ్లీ టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

More Telugu News